ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు కొత్త వరాలు ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు అండగా నిలవడానికి, సొంత ఆటోను కలిగి ఉండి నడుపుకునే ప్రతి డ్రైవర్‌కూ ఏడాదికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని జగన్ ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా ప్రతి ఊర్లోనూ తనతో ఆటో సంఘాల నేతలు తమ వెతలను చెప్పుకుంటున్నారని.. బతకు భారం అవుతోందని చెబుతున్నారని.. వారి సమస్యలను అర్థం చేసుకుని వారికి అండగా నిలవడానికి ప్రతి యేటా పది వేల రూపాయల సాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేసిందని, ఆ సర్టిఫికెట్లు సంపాదించుకోవాలంటే ప్రతి ఆటోకీ ఇన్సూరెన్స్ ఉండాలని, ఇన్సూరెన్స్ మొత్తం ఏడాదికి ఎనిమిది వేల రూపాయల వరకూ ఉంటోందని ఆటో డ్రైవర్ యూనియన్ నేతలు తనకు వివరించారని జగన్ పేర్కొన్నారు. అలాగే ఆటో రిపేర్లకు కూడా కొంత ఖర్చు వస్తుందని.. వీటిని పరిగణనలోకి తీసుకుని సొంత ఆటో పెట్టుకుని బతికే ప్రతి డ్రైవర్‌కీ పది వేల రూపాయలు ఇస్తామని జగన్ పేర్కొన్నారు. జగన్ ఈ హామీని ఇవ్వడంతో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద ఆటో యూనియన్ లీడర్లు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపారు. జగన్ కాసేపు ఆటో డ్రైవర్ గా మారిపోయారు. ఆటో డ్రైవర్ల యూనిఫారం అయిన ఖాకీ చొక్కాను వేసుకుని జగన్ ఆటో నడిపారు.