న్యూఢిల్లీ ఏప్రిల్ 9
ప్రికాషన్ డోసుగా వ్యవహరించే బూస్టర్ డోసు దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ ప్రికాషన్ డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించారు. సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదార్ పూనావాలా శనివారం ఈ మేరకు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత, ప్రైవేట్ ఆసుపత్రులలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ఒక్కో డోసుకు రూ.600 నుండి రూ.225కి సవరించాలని ఎస్‌ఐఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని మేం ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. 18 ఏండ్లు నిండిన అందరికీ ప్రికాషన్ డోసుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం మరోసారి అభినందిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.కాగా, పికాషనరీ డోసుపై కేంద్రం శుక్రవారం చేసిన ప్రకటనను స్వాగతించిన అదార్ పూనావాలా, కొవిషీల్డ్ బూస్టర్ డోసు ధర రూ.600గా పేర్కొన్నారు. పన్నులు అదనమని వెల్లడించారు. అయితే ఆసుపత్రులు, పంపిణీ దారులకు బూస్టర్ డోసు కొవిషీల్డ్ టీకాలపై భారీగా డిస్కౌంట్ ఇస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రికాషనరీ డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించారు. అయితే సర్వీస్ చార్జీ గరిష్ఠంగా రూ.150 మాత్రమే ఉండాలని కేంద్రం శనివారం ప్రకటించింది.