YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వెబ్ సైట్ తప్పులు.... ఇబ్బందులు పడుతున్న జనాలు

వెబ్ సైట్ తప్పులు.... ఇబ్బందులు పడుతున్న జనాలు

గుంటూరు, ఏప్రిల్ 11,
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పన్నుల పరంపర చిత్రవిచిత్రంగా కొనసాగుతోంది. ఆన్ లైన్ లోపాలతో వెబ్ సైట్లు పనిచేయకపోవడంతో ఖాళీ స్థలాలకు ఇంటి పన్నులు, ఇళ్లకు ఖాళీ స్థలాల పన్నులు వసూలు చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా సీడీఎంఏ వెబ్ సైట్ లోపాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోపాలను సరిదిద్దాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో అందుబాటులో టెక్నాలజీ ఉన్నా ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్ను నిర్ధారించే వెబ్ సైట్ పనిచేయకపోవడంతో ప్రజలు పెద్దఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ లో ఖాళీ స్థలం నుంచి ఇంటి పన్ను మ్యుటేషన్ అయ్యే వెబ్ సైట్ గత ఏడు నెలల నుంచి పనిచేయడం లేదు. కార్పొరేషన్ లోని రెవెన్యూ విభాగానికి సంబంధించిన మరికొన్ని వెబ్ సైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందితో పాటు నష్టాలకు గురవుతున్నారు. కావాలనే అధికారులు ఆదాయ వనరులు సమకూర్చుకునేందుకు ఆన్లైన్ సర్వీస్ లు నిలిపివేసారాన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ఖాళీ స్థలం నుంచి ఇంటిపన్నుకి మారే ఆన్లైన్ సర్వీస్ అందుబాటులో రాకపోవడంతో గుంటూరు నగరంలో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని నివాస గృహాలు, గృహ సముదాయాలు నిర్మిస్తున్న గృహ యజమానులు బిల్డర్ ల నుండి నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన ఇంటి యజమానులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.సాధారణంగా ఒక ఇల్లు నిర్మించాలంటే ఇంటి స్థలానికి ఖాళీ స్థలం పన్ను వేయించాలి. తర్వాత బిల్డింగ్ ప్లాన్ టౌన్ ప్లానింగ్ అధికారులు మంజూరు చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత హౌస్ టాక్స్ అమల్లోకి వస్తుంది.సాధారణంగా ఇంటి డాక్యుమెంట్ వ్యాల్యూ ని బట్టి ఆరు నెలలకు వంద గజాల ఖాళీ స్థలానికి సుమారు పదిలక్షల విలువకు 0.25 శాతం పన్ను చొప్పున టాక్స్ వేస్తారు. ఆరు నెలలకి 2500 రూపాయల టాక్స్ పడుతుంది. అదే వంద గజాల స్థలంలో ఇంటి పన్ను వేస్తే ఆరు నెలలకు వెయ్యి రూపాయలలోపు టాక్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న గోరంట్ల, పెదపలకలురు, ఇన్నర్ రింగ్ రోడ్డు లాంటి ఎక్స్టెంట్ ప్రాంతాలలో నిర్మించుకున్న భవనాలకు గతం లో మాదిరి గానే ఖాళీ స్థలాల పన్నులు పడుతున్నాయి. భవనాలు నిర్మించుకునేటప్పుడు ప్లానింగ్ తీసుకునేటప్పుడు తాము పన్నులు కట్టామని ఇప్పుడు భవనాలు నిర్మించుకున్నా సరే టాక్స్ ల మోత మోగిస్తున్నారని అంటున్నారు ప్రజలు.ఈ తరహా అదనపు టాక్స్ కడుతున్న వాళ్లు గుంటూరు కార్పోరేషన్ పరిధిలో వేల సంఖ్యలో ఉన్నారు. ప్రతి నెల కార్పొరేషన్ కి వేకెంట్ లాండ్ నుండి హౌస్ టాక్స్ కన్వర్షన్ కి వచ్చే దరఖాస్తులు వందల సంఖ్యలో ఉంటున్నాయి. ఆన్లైన్ సర్వీస్ లు అందుబాటులో లేక పోవడంతో గత అక్టోబర్ నుండి ఈ తరహా కన్వర్షన్ దరఖాస్తు దారులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఇంటి పన్ను వేస్తేనే ఆ ఇంటికి నీటి కుళాయి, డోర్ నంబర్ తో పాటు సచివాలయంలో మాపింగ్ వంటి సేవలు లభిస్తాయి. ప్రస్తుతం కన్వర్షన్ సైట్ ఆగి పోవడం తో ఒక్క మాటలో చెప్పాలి అంటే గృహాలు, గృహ సముదాయాలలో నివసించే ప్రజలు భవనం లేని స్థల యజమానిగా మిగిలిపోతారు . ఈ విషయం పై అధికారులను దరఖాస్తు దారులు ఎన్నిసార్లు అభ్యర్థించిన ఆన్లైన్ సైట్లు ఆగిపోతే మేమేం చేయాలంటూ సమాధానం వస్తుంది తప్ప దీనికి కారణం ఏంటో జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోతుంది.అయితే కార్పొరేషన్ల ఆదాయం పెంచుకోవటానికి రాష్ట్ర స్థాయి అధికారులు సైట్ నిలిపివేశారని, లేదంటే ఆరు నెలల కాలంగా ఒక వెబ్ సైట్ టెక్నికల్ ఎర్రర్ సరి దిద్దలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఉందా ? అన్న అనుమానాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆన్లైన్ సర్వీస్ అందించే అధికారులపై వుంది.

Related Posts