గుంటూరు, ఏప్రిల్ 11,
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మధ్య దూకుడు పెంచారు.. ఓవైపు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టిసారించిన ఆయన.. పాత మంత్రుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి.. ఎవ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి.. కొత్తవారు ఎవరైనా మంత్రులుగా బెటర్, సామాజిక సమీకరణలతో ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనే విషయాలపై కసరత్తు చేస్తున్నారు.. మరోవైపు ప్రత్యర్థులపై పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. గత రెండ్రోజులు నుంచి బహిరంగ సభల్లో విమర్శల ధోరణి మార్చారు. హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత విపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.. అయితే, ఈ దూకుడు వెనుక వ్యూహం ఏమైనా ఉందా? అనే చర్చ సాగుతోంది.ముఖ్యమంత్రి మాటల్లో వాడి, వేడి పెరిగింది. ప్రత్యర్ధులపై విమర్శల్లో దూకుడు పెంచారు. నర్సరావుపేట బహిరంగ సభలో ప్రతిపక్షాలపై హాట్ కామెంట్లు చేశారు సీఎం. అసూయతో రగిలిపోతే తొందరగా బీపీ వస్తుందని, టికెట్ తీసుకుంటారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగనన్న వసతి దీవెన కార్యక్రమం కోసం నంద్యాల వెళ్లిన సీఎం బహిరంగ సభలో మరో అడుగు ముందుకు వేశారు. దేవుడి దయ, ప్రజల దీవెన ఉంటే తనని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.. అంతెందుకు.. ఏమీ పీకలేరని కూడా వ్యాఖ్యానించారు.. అయితే, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ స్పీచ్‌లను ఇప్పుడు పార్టీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు జగన్ దాదాపుగా ఆచితూచి మాట్లాడుతూ వచ్చారు. వచ్చే రెండేళ్లు పార్టీని, ప్రభుత్వాన్ని ఎన్నికల దిశగా నడిపించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న జగన్… బహిరంగ సభల్లోనూ.. ఉపన్యాసాల్లో రాజకీయ విమర్శలు ప్రారంభించారని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శల్లో పదను పెంచి ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్తున్నట్లు భావిస్తున్నారు. అటు కార్యకర్తలు, కిందిస్థాయి నాయకుల్లోనూ జోష్ పెరుగుతుంది. ఈ అన్ని లెక్కలు వేసుకునే సీఎం జగన్ ఉపన్యాసాల శైలి మార్చారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక, సీఎం వైఎస్ జగన్ ప్రస్టేషన్‌లో ఉన్నారని.. అందుకే ఊగిపోతున్నారంటూ విమర్శలు గుప్పించేవారు కూడా లేకపోలేదు.