YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ మొదటికి పునర్విభజన

మళ్లీ మొదటికి పునర్విభజన

విజయవాడ, ఏప్రిల్ 11,
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదా? భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలను విభజించాల్సి వచ్చినప్పుడైనా ఇలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా స్పష్టమైన మార్గదర్శకాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేయాల్సిన అవసరం ఉందా? ఏపీ పునర్విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన సవరణ పిటిషన్ ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్తంలోని సుప్రీం ధర్మాసం విచారణకు సానుకూలత వ్యక్తం చేయడంతో ఏపీ విభజనలో శాస్త్రీయత లేదన్న అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఉండవల్లి దాఖలు చేసిన సవరణ పిటిషన్ ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఉండవల్లి తరఫున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, అల్లంకి రమేశ్ వాదిస్తున్నారు. ఆంధ్రదేశ్ విభజనలో శాస్త్రీయత లేదని, విభజన చట్టాన్ని కొట్టివేయాలంటూ ఉండవల్లి అరుణ్ కుమార్, మరి కొందరు 2014లోనే వందకు పైగా పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఆ సమయంలో జస్టిస్ హెచ్ఎల్ దత్తు ప్రతివాదులకు నోటిసులు కూడా జారీ చేశారు. కానీ అప్పుడు ఎందుకో విచారణ మాత్రం జరగలేదు. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఉండవల్లి తన తొలి పిటిషన్ లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే.. తొలి పిటిషన్ లోని ఆర్థిక సాయం అంశాన్ని మార్చి గత జనవరిలో సవరణ పిటిషన్ దాఖలు చేశారు. ఏదో ఒక రోజు ఈ పిటిషన్ విచారణకు కేటాయించాలని ఉండవల్లి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన విచారణ జరిపేందుకు తేదీ కేటాయిస్తామని చెప్పారు.  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 (డి)(10) ఉన్నంతవరకూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అవకాశమే లేదని రాజ్యాంగాన్ని బాగా ఔపోసన పట్టిన నిపుణులు చెబుతుండడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం విభజిస్తున్నట్లు అప్పటి యూపీఏ ప్రభుత్వం పేర్కొంది. అయితే.. ఆర్టికల్ 3తో సహా అన్ని ఆర్టికల్స్ నూ ఆర్టికల్ 370 (డి)(10) చేస్తుందని వారు వివరిస్తున్నారు. ఆర్టికల్ 370 (డి)(10) ను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించడాన్ని మోసం చేసినట్లే అని నిపుణులు వివరిస్తున్నారు. రాజ్యాంగంలోని మోసం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని సవరించడానికి నిర్దేశించిన విధానం అనుసరించకుండానే ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 97 ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి)ని సవరించడాన్ని వారు వెలెత్తి చూపిస్తున్నారు. 1950 నుంచీ కూడా భారత రాజ్యాంగ సవరణలలో ఇలాంటి మోసం జరగలేదనే విషయాన్ని వారు ఉటంకిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (ఇ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్శిటీ స్థాపన కోసం ఉద్దేశించి పొందుపరిచినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ 371 (ఇ) ఆర్టికల్ ను అనుసరించి ఏపీలో ఉండాల్సిన సెంట్రల్ వర్శిటీ రాజ్యాంగ విరుద్ధంగా విభజన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విషయం వారు ప్రస్తావిస్తుండడం గమనార్హం. వాస్తవానికి ఈ ఆర్టికల్ ను సవరించాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. కానీ ఏపీ విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన రీతిలో విడగొట్టిందని వారు అంటున్నారు. ఇలా చూసినా ఏపీ విభజన చట్టం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు విశ్లేషిస్తుండడం విశేషం. విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని ఇప్పటికైనా తేటతెల్లం అవుతుందో లేదో.. సుప్రీం ధర్మాసం దీనిపై ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Related Posts