ఏలూరు, ఏప్రిల్ 11,
ఏపీ నుంచి పారిపోదామని చూస్తున్నారంతా. ప్రజలు ఇప్పటికే హైదరాబాద్ బాట పట్టేశారు. బంధువులకు ఫోన్లు చేసి.. ఈ వేసవి సెలవుల్లో మీ ఇంటికి వస్తామంటూ బతిమిలాడుకుంటున్నారు. కాస్త డబ్బులు ఉన్నోళ్లైతే.. సమ్మర్ టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వారు ఏపీలో ఉండలేకపోతున్నారు కాబట్టి. రోజంతా.. పదే పదే.. ఎడాపెడా.. కరెంట్ కోతలతో నరకం చూస్తున్నారు మరి. పగలు, రాత్రి తేడా లేకుండా.. కోతలే కోతలు. రాత్రిళ్లు చీకట్లు, పగలంతా ఉక్కబోత. ఆసుపత్రుల్లో సెల్‌ఫోన్ వెలుగుల్లో ఆపరేషన్లు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణమో. ఇక పవర్ హాలిడేతో.. పరిశ్రమలు సైతం లబోదిబో మంటున్నాయి. కరెంట్ లేక, కంపెనీలు నడవక, లోన్లు కట్టలేక, జీతాలు ఇవ్వలేక.. తాము నిండా మునిగిపోవడం ఖాయమని వాపోతున్నారు. ఇదంతా సరేగానీ.. ఏపీకి చుట్టు పక్కల ఉన్న ఏ రాష్ట్రంలోనూ లేని కరెంట్ కోతలు.. ఒక్క మన రాష్ట్రంలోనే ఎందుకొచ్చినట్టు? దక్షిణాది రాష్ట్రాలంతా ఫుల్‌గా పవర్ ఉంటుంటే.. ఆంధ్రలోనే ఎందుకీ పవర్ ప్రాబ్లమ్స్? లోపం ఎక్కడ? తప్పు ఎవరిది? ఈ కోతలకీ, నరకానికీ.. జగన్‌రెడ్డీనే కారణమా? అంటే అవుననే అంటున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీలో ఫుల్‌గా కరెంట్ ఉండేది. జగనన్న పాలనలో అంధఃకారం అలుముకుంది. సడెన్‌గా విద్యుత్ డిమాండ్ ఏమైనా పెరిగిందా? అంటే లేదు. డిమాండ్‌కు తగినంత విద్యుత్ కొనకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళలు ముందు చూపుతో ముందే ఒప్పందాలు చేసుకొని కరెంట్ లోటు లేకుండా చూసుకున్నాయి. ఇక, జగనన్న అయితే చంద్రబాబు కాలంలో చేసుకున్న ఒప్పందాలనే రద్దు చేసుకున్నారు. ఆయన కొత్తగా ఎలాంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోలేదు. ఇప్పుడు కొందామన్నా ఖజానాలో డబ్బులు లేవు. ఫలితం.. జనానికీ కోతల టార్చర్. తెలంగాణలో విద్యుత్ డిమాండు 250-260 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మధ్య ఉన్నా, అవసరమైన విద్యుత్‌ను ఎక్స్ఛేంజీల నుంచి కొనుగోలు చేసి సమస్య లేకుండా సరఫరా చేస్తున్నారు. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగానే ఉన్నా.. కావల్సిన వనరులున్నా.. ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడమే ప్రస్తుత సమస్యకు కారణమైంది. దక్షిణ భారతంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండు సుమారు 1,221 ఎంయూలు. మొత్తం లోటు 28.71 ఎంయూలు కాగా, అందులో 23.53 ఎంయూలు ఏపీదే కావడం దారుణం. తెలంగాణలో విద్యుత్ డిమాండు 265 ఎంయూలకు చేరింది. ఉత్పత్తి 111.58 ఎంయూలే. కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి రోజుకు 50 ఎంయూల వరకు తీసుకుంటోంది. డిమాండు సర్దుబాటు కోసం రోజుకు 90 ఎంయూలను ఎక్స్ఛేంజీల నుంచి కొంటున్నారు. రూ.70-100 కోట్ల మధ్య విద్యుత్ కొనుగోలుకు ఖర్చుచేసి అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తున్నారు. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. ఇది పక్కా జగన్‌రెడ్డి ఫెయిల్యూరే అంటున్నారు. తమిళనాడులో విద్యుత్ డిమాండు అత్యంత ఎక్కువగా 365.35 ఎంయూల వరకు ఉంది. పీపీఏల ద్వారా 230 ఎంయూలు, అణువిద్యుత్ 46 ఎంయూలు తీసుకుని నిరంతరం సరఫరా చేస్తున్నాయి. కర్ణాటకలో డిమాండు 271.32 ఎంయూలకు చేరింది. ఉత్పత్తి 182.21 ఎంయూ మాత్రమే. 90 ఎంయూలు కొనేలా ముందే ప్రణాళిక రూపొందించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో డిమాండు 235 ఎంయూలు. థర్మల్ విద్యుత్ 89.83 ఎంయూలు (దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకే ఎక్కువ), జల విద్యుత్ 7.78 ఎంయూలు, ఇతర వనరుల నుంచి వచ్చే విద్యుత్ 3.61 ఎంయూలు, పునరుత్పాదక విద్యుత్ 27 ఎంయూలు వస్తోంది. అన్ని వనరుల నుంచి ప్రస్తుతం 130 ఎంయూలు, కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి 40-50 ఎంయూలు అందుతున్నా.. మిగిలిన లోటును సమకూర్చుకోవటంలో ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు విఫలమయ్యాయి. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా విద్యుత్తును సేకరించి.. ప్రజలకు, పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇస్తున్నారు. ఏపీలో అధికారికంగానే కోతలు. జనాలకు, కంపెనీలకు కష్టాలు, నష్టాలు. ఇదీ జగనన్న పాలన. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు అనుభవించాల్సిందేనా?