విజయవాడ, ఏప్రిల్ 11,
ఉన్న కుంపట్లు సరిపోనట్టు.. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణతో జగన్‌రెడ్డి మరిన్ని కష్టాలు కోరి తెచ్చుకున్నారని అంటున్నారు. 24 మంది మంత్రులు రాజీనామాలు చేసి.. తామంతా హ్యాపీగానే చేశామని బయటకు చెబుతున్నా.. వారి మాడిపోయిన ముఖాలు చూస్తేనే తెలిసిపోతోంది వారెంత అసంతృప్తితో ఉన్నారో. మనసులో ఏ బాధ, ఏ భావం ఉన్నా, ఎవరికి వారు మరో మాట మాట్లాడకుండా.. రాజీనామా లేఖలు జగనన్నకు ఇచ్చేసి.. జేబుల్లో చేతులు పెట్టుకుని మౌనంగా అలా నడుచుకుంటూ వెళ్లి పోయారు. అంతర్గతంగా అలకలు, లుకలుకలతో తాజా మాజీలంతా జగనన్నపై రగిలిపోతున్నారని తెలుస్తోంది. మూడేళ్లుగా మంత్రిగా పదవి అనుభవిస్తే.. ఇప్పుడు సడెన్‌గా తీసేస్తే.. తమపై అసమర్థులమనే ముద్ర పడుతుందని.. ప్రజల ముందు తలెత్తుకునే పరిస్థితి ఉండదని మండిపడుతున్నారు. కొందరు సీనియర్లు అయితే నేరుగా జగన్ దగ్గరే తమ అసహనం వెల్లగక్కారని చెబుతున్నారు. కొడాలి నాని అయితే మూడు రోజుల ముందే అధినేతకు పరోక్షంగా పబ్లిక్‌గా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. అందుకే, సీఎం జగన్ మళ్లీ పునరాలోచన చేస్తున్నారని.. ఓ 10 మందిని తిరిగి కేబినెట్ హోదా కల్పించారు... అది మరో కొత్త సమస్యకు దారి తీస్తోంది. బొత్సా, పెద్దిరెడ్డి, సురేశ్‌లాంటి వాళ్లకు మరోసారి ఛాన్స్ ఇస్తే.. వాళ్లు బెస్ట్, తామంతా వేస్ట్ అనే మెసేజ్ ప్రజల్లోకి వెళుతుందని, తాము నియోజకవర్గంలో చులకన అవుతామని వాపోతున్నారు తాజా మాజీలు. సామాజిక సమీకరణాల కారణంగా కొందరు మంత్రులను మళ్లీ కొనసాగించక తప్పదని ముఖ్యమంత్రి భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి సురేశ్‌కు మళ్లీ ఛాన్స్ ఇవ్వనున్నారనే ప్రచారం అదే జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆగ్రహం తెప్పించింది. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుజ్జగించినా ఆయన అలక వీడలేదు. ఉంటే ఇద్దరం ఉండాలి.. లేదంటే ఇద్దరినీ తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారట బాలినేని. బాలినేనిని జగన్ పిలిపించుకుని మాట్లాడారని.. సురేశ్ కొనసాగి తీరుతారని సీఎం సూటిగా చెప్పినట్టు తెలిసింది.ఏపీ మంత్రి వర్గ కూర్పుపై సమీకరణాలు మారుతున్నాయి. సీనియర్లు అలకపాన్పు ఎక్కడం జగన్‌కు తలనొప్పిగా మారింది. అయితే ఏడాది క్రితం ప్రమాణస్వీకారం చేసిన వేణుగోపాల్ కృష్ణ, అప్పలరాజుపై స్పష్టత వచ్చింది. కొత్తగా కేబినెట్‌లోకి శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్‌నాథ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే కె.అబ్బయ్యచౌదరి (కమ్మ), కోనసీమ జిల్లాలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు(ఎస్సీ), ఎన్‌టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు(ఎస్సీ)లకు బెర్తు ఖాయం చేశారు. మైనారిటీ కోటాల్లో హఫీజ్‌ఖాన్, ముస్తఫాల్లో ఒకరికి చోటు కల్పించబోతున్నారు. అలాగే రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు ఒక్కో పదవి కట్ కాబోతోంది. తగ్గించిన పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లభించే అవకాశమున్నట్లు సమాచారం.ఇక, మూడేళ్లుగా కళ్లల్లో వత్తులు వేసుకుని మంత్రి పదవి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆర్కే రోజా అండ్ కో పరిస్థితి ఏమిటి? అనే చర్చ పార్టీలో జరుగుతోంది. తొలి మంత్రి వర్గంలోనే పదవి ఆశించి భంగపడిన ధర్మాన, ఆనం, తమ్మినేని, అంబటి, కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి.. ఇలా చాలామందే తాజా విస్తరణలోనూ ఆశలు పెట్టుకున్నారు. ఇలా జిల్లాల వారీగా లిస్ట్ భారీగానే ఉంది. కొత్త కేబినెట్‌లో మంత్రి పదవి వస్తే ఓకే, లేదంటే..? ఆశావహులంతా అసంతృప్తితో, అసహనంతో, ఆగ్రహంతో రగిలిపోవడం ఖాయం. అది పార్టీలో సంక్షోభానికీ దారి తీయొచ్చు అంటున్నారు. తిరుగుబాటు ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని అంచనా వేస్తున్నారు.గతంలో అయితే జగన్‌కు పార్టీ కేడర్ అంతా కట్టప్పలా కట్టుబడి ఉండేది. అప్పట్లో ఆయనే సుప్రీం. ఆయన చెప్పిందే శాసనం. ఇస్తే మంత్రి.. పీకేస్తే మాజీ. వైసీపీ బిగ్ బాస్ జగన్‌రెడ్డి. ఇదంతా గతం. ఆ రోజులు పోయాయి. ఇప్పుడలా తలొగ్గే పరిస్థితి లేదు. కరెంట్ కోతలు, విద్యుత్ ఛార్జీలు, పీఆర్సీతో ఉద్యోగులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు.. ఇలా వివిధ వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో.. జగనన్నను నమ్ముకొని మరోసారి గెలిచే పరిస్థితి లేదనే గ్రహింపునకు వచ్చేశారు ఎమ్మెల్యేలు. అందుకే, స్వతంత్రంగా ఉనికి చాటుకునేందుకు సిద్ధం అవుతున్నారు. జగన్ చెప్పినట్టు పడుండేందుకు చాలామంది ఇష్టపడటం లేదు. ఇప్పటికే పలు జిల్లాల్లో, నియోజకవర్గాల్లో రెబెల్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలపై దిగువశ్రేణి నాయకులు తిరగబడుతుంటే.. ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే అధినేతకు ఝలక్ ఇచ్చేందుకు సై అంటున్నారు. కాకపోతే సరైన సమయం కోసం మౌనంగా వేచి చూస్తున్నారంతే.