నెల్లూరు, ఏప్రిల్ 11,
పరిపాలన వికేంద్రీకరణ పేరుతో జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభమైనప్పటికీ, జిల్లా ప్రజా పరిషత్తుల్లో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చినప్పటికీ 13 జిల్లా పరిషత్ పాలక మండళ్లనే కొనసాగించనున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జెడ్‌పిల విభజనకు అవకాశం లేకుండా పోయింది. దీంతో పాత జిల్లాల్లోనే పరిపాలన కొనసాగుతోంది. ప్రస్తుత జెడ్‌పి పాలకవర్గాల పదవీకాలం పూర్తయ్యే వరకు ఇదే విధానం ఉంటుందని ప్రభుత్వం నోటిఫికేషన్‌నూ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాత, కొత్త జిల్లాల్లో అభివృద్ధి పనుల అమలు విషయంలో జెడ్‌పిలపై అధిక భారం పడనుంది. గ్రామాల్లో జిల్లా పరిషత్‌కు సంబంధించిన కార్యక్రమాలను ముఖ్య కార్యనిర్వహణాధికారులే (సిఇఓ) పర్యవేక్షించాల్సి ఉంది. జెడ్‌పిపరంగా కొత్తజిల్లాల్లో జరిగే అధికారిక కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు విధిగా హాజరుకావల్సిన పరిస్థితి నెలకొంది. చట్టం ప్రకారం మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జెడ్‌పి సర్వసభ్య సమావేశాలు, స్టాండింగ్ కమిటీ సమావేశాల సమయంలో కొత్త జిల్లాల నుంచి అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సేకరించే బాధ్యత పాత జిల్లాలదే. జెడ్‌పి స్కూల్స్, ఆస్తుల పరిరక్షణ, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్వహణ, అద్దెల వసూలు వంటి పనులన్నీ గతంలో మాదిరిగానే కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో జెడ్‌పిలో ప్రణాళికా విభాగంపై అదనపు భారం పడుతుందని అధఙకారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి ప్రతిపాదనలు తీసుకునే అధికారులు, పునర్విభజనతో రెండు నుంచి నాలుగు కొత్త జిల్లాల అధికారులతో మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఆయా జిల్లాల అధికారులు, ప్రజా ప్రతినిధులకు సమావేశాల అజెండా పంపించడం తలకు మించిన భారంగా మారనుంది. సొంత జిల్లాతోపాటు విభజిత జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుంటూ పాలన సాగించడం కాస్త ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారనుంది. ఒక్కో జిల్లా రెండు నుంచి నాలుగు జిల్లాలుగా మారాయి. ఈ నేపథ్యంలో విభజిత జిల్లాల్లో ప్రాంతాలకు నిధుల కేటాయింపులపై జిల్లాస్థాయి అధికారులతోపాటు ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తాయని జెడ్‌పి అధికారులే చెబుతున్నారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలో ప్రాంతాలు పునర్విభజనతో నాలుగు జిల్లాల్లోకి వెళ్లాయి. రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి, కాకినాడ, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాలు ఆవిర్భవించగా, ఏజెన్సీ ప్రాంతమంతా పాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్లింది. అలాగే కృష్ణా జిల్లాలో మండలాలు కృష్ణాతోపాటు ఎన్‌టిఆర్, ఏలూరు జిల్లాలోకి, విశాఖ జిల్లా మండలాలు విశాఖతోపాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోకి వెళ్లాయి. తూర్పు గోదావరి జెడ్‌పి కాకినాడ కేంద్రంగా ఉంది. ఆ జిల్లా జెడ్‌పి సిఇఓ రాజమహేంద్రవరం, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో చర్చించిన అనంతరమే సమావేశాల అజెండాను రూపొందించాల్సి ఉంది. పాత జెడ్‌పిలలో పాలనను కొనసాగించడం వల్ల సాంకేతిక సమస్యలను ఎదుర్కొనక తప్పదని జిల్లా పరిషత్ ప్రణాళిక విభాగం అధికారి ఒకరు తెలిపారు.జెడ్‌పి సమావేశాలకు విభజిత జిల్లాల కలెక్టర్ల హాజరు తప్పనిసరి. జెడ్‌పి సమావేశాలకు కలెక్టర్లు హాజరు కాకపోతే, సభ్యులు అడిగే ప్రశ్నలకు జిల్లాస్థాయి అధికారుల నుంచి పెద్దగా స్పందన ఉండదు. విభజిత జిల్లాల్లో ముఖ్యమైన శాఖల అధికారులు సమావేశాలకు హాజరైతే సరిపోతుందని జెడ్‌పి సీనియర్ సిఇఓ 'ప్రజాశక్తి'కి తెలిపారు. పాత జెడ్‌పిలుంటాయని నోటిఫికేషన్ వచ్చినా, విభజిత జిల్లాలతో సమన్వయంపై ఎలాంటి మార్గదర్శకాలూ రాలేదన్నారు. పాత జిల్లాల ప్రకారమే పరిపాలనను కొనసాగిస్తామని వివరించారు. సమావేశాల నిర్వహణ, అభివృద్ధి పనుల చేపట్టే విషయంలో కొత్త జిల్లాల కలెక్టర్లు, ముఖ్యమైన శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.