హైదరాబాద్, ఏప్రిల్ 11,
కరోనా కారణంగా రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. అన్ని రకాల కార్యాలయాలు తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా వెసులుబాటు కల్పించాయి. కొన్నేళ్లుగా దేశంలో వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, కరోనా కేసులుతగ్గిపోవడంతో ఉద్యోగులను తమ సిబ్బందిని ఆఫీస్ లకు రావాలని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇన్నాళ్లు వర్క్ ఫ్రం హోమ్ కు అలవాటు పడిన ఉద్యోగులు.. తిరిగి ఆఫీస్ కు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. వీరిని ఆకర్షించుకునేందుకు ఐటీ, వివిధ రంగాల సంస్థలు వివిధ చర్యలు చేపడుతున్నారు. రెండేళ్ల తర్వాత కార్యాలయాలకు వస్తున్న ఎంప్లాయిస్ కు బహుమతులు ప్రకటిస్తున్నాయి. ఇన్నాళ్లు ఇంటి దగ్గరే ఉన్న సిబ్బందిని ఒక్కసారిగా ఆఫీస్ లకు రప్పిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో.. హైబ్రిడ్ వర్క్ కల్చర్ అమలు చేస్తున్నారు. అంటే వారంలో రెండు లేదా మూడు రోజులు ఆఫీస్ కు వస్తే చాలు. వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన వారు మళ్లీ కొత్త ఇళ్లు వెతుక్కోవడానికి ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి.
హైదరాబాద్ మినహాయించి వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగులకు 15-20 రోజుల వరకూ ఉచిత వసతి ఇస్తున్నాయి. కుటుంబంతో కలిసి ఉండేందుకు వీలుగా అపార్టుమెంట్లులోని ప్లాట్లలో వసతి కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ‘రీ లోకేషన్ బోనస్’ పేరిట అదనంగా కొంత మొత్తం చెల్లిస్తున్నాయి. సొంతూళ్ల నుంచి సామగ్రిని తరలించేందుకు రవాణా ఖర్చులు భరిస్తున్నాయి. మహిళా ఉద్యోగుల పిల్లలకు ‘డే కేర్’ సదుపాయం కల్పిస్తున్నాయి. ‘బ్యాక్ టు ఆఫీస్’ పేరిట బహుమతులు ఇస్తున్నాయి. రెండు మూడు రోజులకు సరిపడా హోటల్ బిల్లులు ఇస్తున్నాయి.
ఐటీ కారిడార్‌లో అద్దె ఇళ్లు, హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం 15-20 శాతం మంది ఉద్యోగులే కార్యాలయాలకు వస్తున్నారు. మిగిలిన వారిని రప్పించేందుకు కొన్ని కంపెనీలు ఈ బహుమతుల పద్ధతి ఎంచుకుంటున్నాయి. ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులకు హాజరైతే తమకు కొంత ఊరట లభిస్తుందని హాస్టళ్ల నిర్వాహకులు చెబుతున్నారు