అమరావతి
తొలి మంత్రివర్గం పదవీకాలం ముగుస్తుందనే చర్చ మొదలైన నాటినుంచి.. ఈ రోజు ప్రకటన వెలువడే వరకూ కేబినెట్లో చోటుకోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నవారంతా.. తమ ఆశలు అడియాసలు అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నారు. క్యాబినెట్ లో బెర్త్ దొరకని వారి అనుచర గణం చేస్తున్న ఆందోళనకు అంతే లేదు. కొందరు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతుండగా.. మరికొందరు రోడ్డెక్కి రచ్చ రచ్చ చేస్తున్నారు. కొత్త కేబినెట్లో చోటు దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మంత్రిపదవి దక్కని వారిలో పలువురు.. వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుండగా.. వారి అనుచరులు ప్రత్యక్ష ఆందోళనకు దిగి రచ్చ రచ్చ చేస్తున్నారు.
బాలినేని అలక:
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్ను మంత్రివర్గంలో కొనసాగించి, తనను తొలగించిన నేపథ్యంలో బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. స్వయంగా సజ్జల బాలినేని ఇంటికి వెళ్లి చర్చలు జరపినా.. ఆయన చల్లారలేదని తెలుస్తోంది. మరోవైపు బాలినేని అనుచరులు, మద్దతుదారులు ఆయన నివాసం వద్దకు చేరుకుని.. శ్రీనివాసులురెడ్డిని మంత్రివర్గంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి చోటు దక్కలేదని ఇంకొల్లు మండలం జెడ్పీటీసీ పదవికి భవనం శ్రీలక్ష్మీ రాజీనామా చేశారు.
మాచర్లలో ఉద్రిక్తత:
పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి.. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినా రామకృష్ణారెడ్డి విషయంలో సర్కారు మొండిచేయి చూపడంపై మండిపడ్డారు. మాచర్ల రింగు రోడ్డులో ద్విచక్రవాహనం, టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. పిన్నెల్లికి పదవి ఇవ్వకపోవడంపై మాచర్ల మున్సిపల్ ఛైర్మన్తోపాటు ఐదుగురు ఎంపీపీలు, ఐదుగురు జడ్పీటీసీలు, 65మంది ఎంపీటీసీలు, 31 మంది కౌన్సిలర్లు.. పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి పట్టణంలోని బస్టాండ్ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు.
కోటంరెడ్డి కన్నీటి పర్యంతం:
మంత్రి పదవి రాకపోవడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీకి రాజీనామా చేద్దామని వైకాపా కొర్పొరేటర్లు, మండల నాయకులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేను ఓదార్చేందుకు ప్రయత్నించారు. మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించిందన్న కోటంరెడ్డి.. అంతిమంగా సీఎం జగన్ నిర్ణయం శిరోధార్యమన్నారు. వైకాపా నాయకులెవరూ రాజీనామాలు చేయవద్దన్నారు.
విజయవాడలో ఆందోళన:
విజయవాడ బందరు రోడ్డులో వైకాపా శ్రేణులు కొలుసు పార్థసారధి వర్గీయుల ఆందోళన చేపట్టారు. ఈ మేరకు విజయవాడలోని పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కొలుసు పార్థసారధికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెనమలూరు నుంచి వైకాపా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ఉదయభాను అనుచరుల ఆందోళన:
మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనుచరులు భగ్గుమన్నారు. ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. పెట్రోల్పోసి ద్విచక్రవాహనాన్ని తగులబెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు మంటలు అంటుకున్నాయి. వారిద్దరూ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు జగ్గయ్యపేటలోని ఉదయభాను నివాసం వద్దకు వైకాపా నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఉదయభానుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.
సుచరిత పట్ల వివక్ష ఎందుకు?
మేకతోటి సుచరితకు నూతన మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంపై అభిమానులు భగ్గుమన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత ఇంటి ముందు ఆందోళనకు దిగారు. రాజీనామాకు సిద్ధమంటూ పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ప్రకటించారు. కేబినెట్లో మిగతా ఎస్సీ మంత్రుల్ని కొనసాగిస్తూ.. సుచరిత పట్ల వివక్ష చూపడమేమిటని ప్రశ్నించారు. సజ్జలను కలిసేందుకు మూడురోజులుగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకపోయిందని సుచరిత వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆత్మకూరులో రాజీనామాలు:
తమ నేతకు మంత్రి పదవి దక్కలేదని కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఐదుగురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో వీరు రాజీనామాలు చేశారు.