న్యూఢిల్లీ
కేంద్రం యాసంగి ధాన్యం కొనాలనే డిమాండ్తో రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు ముఖ్యమంత్రి కేసీఆర్, భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా స్థాయి నేతలు, మండల స్థాయినేతలు, కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షులు, రైతు కమిటి సభ్యులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో ఒకే విధానం ఉండాలనే డిమాండ్తో ఈ దీక్ష చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి టీఆర్ఎస్ అల్టిమేటం ఇవ్వనుంది. దీక్ష వేదికగా టీఆర్ఎస్ తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రంపై పోరును మరింత తీవ్రం చేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు.
అంతకుముందు సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి, మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పుష్పాలు సమర్పించారు.
కేసీఆర్ మాట్లాడుతూ ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందన్నారు. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరని అన్నారు.
రాకేష్ తికాయట్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదని ప్రశ్నించారు. ఎఫ్సీఐ ధాన్యం కొనటం లేదని తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో నిరసన బాట పట్టారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో తెలుస్తున్నదని అన్నారు.