విజయవాడ, ఏప్రిల్ 12,
రాజకీయాల్లో కులాల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అది నిజమే. ఎవరూ కాదనలేరు. కానీ కులాలను బట్టుకుని వెళ్లాడితే ఆ కులం మొత్తం గంపగుత్తగా పార్టీకే ఓట్లు వేస్తారా? అంటే మరి జగన్ కే తెలియాలి. కొత్త మంత్రి వర్గం జాబితాను చూస్తుంటే జగన్ పక్కా 2024 ఎన్నికల కేబినెట్ ను రూపొందించుకున్నట్లు కనపడుతుంది. ఆరోపణలున్న వారిని, పార్టీ నేతలు స్థానికంగా వ్యవహరిస్తున్న వారికి కూడా జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. కేజగన్ పార్టీ పరిస్థితిని, వారికున్న కేపబులిటీని చూడలేదు. కేవలం కులాన్ని మాత్రమే చూసి మంత్రి వర్గంలోచోటు కల్పించారు. రేపు ప్రచారం లో తాను ఈ కులాలకు ప్రాధాన్యత ఇచ్చానని, తనకే ఓటు వేయాలని కోరుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఉషశ్రీ చరణ‌్ ను కల్యాణదుర్గం స్థానిక నాయకత్వమే వ్యతిరేకిస్తుంది. ఆమె ఎప్పుడూ బెంగళూరులోనే ఉంటారన్న విమర్శలున్నాయి. కేవలం కురుబ సామాజికవర్గం కాబట్టి ఆమెకు జగన్ తన కేబినెట్ లో చోటు కల్పించారు. ఇక పాతమంత్రి గుమ్మనూరి జయరాంపై గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. ఈఎస్ఐ స్కామ్ లో ఆయన కుమారుడు పాత్రను టీడీపీ నేతలు ఫొటోలతో సహా బయటపెట్టారు. ఇక తన నియోజకవర్గంలో అనేకసార్లు పేకాట క్లబ్ లను మంత్రి వర్గీయులు నిర్వహిస్తూ పట్టుబట్టారు. కానీ జగన్ ఇదేమీ పట్టించుకోలేదు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బోయ సామజికవర్గం ఎక్కువగా ఉంది. వారిని తనవైపునకు తిప్పుకునేందుకే జగన్ గుమ్మనూరి జయరాంకు మంత్రి పదవిని రెన్యువల్ చేశారు. ఎన్ని సార్లు గెలిచారన్నది చూడలేదు. తొలి సారి గెలిచిన వారికి కూడా కేబినెట్ లో చోటు దక్కింది. గుంటూరు జిల్లాలో కమ్మ రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్నా అక్కడ కాపు, రజక, ఎస్సీలకే అవకాశమిచ్చారు. గత ఎన్నికలంటే అంతా జగన్ మీద నడిచింది. ఈసారి ఆ పరిస్థిిితి ఉంటుందన్న గ్యారంటీ లేదు. కానీ జగన్ గత ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన కులాల ఈక్వేషన్లనే తిరిగి నమ్ముకున్నారు. కానీ రెడ్డి సామాజికవర్గంలో ఉన్నామని వారిని పదవులకు పూర్తిగా దూరం పెడితే ఎలా అని ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇప్పుడు తమ అసంతృప్తిని బహిరంగంగా బయటపెట్టింది రెడ్డి సామాజికవర్గం నేతలే. కొత్త మంత్రివర్గంలో రెడ్లకు దక్కింది నాలుగు పదవులే. జగన్ కులాలను చూశారు తప్పించి సమర్థత, పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరాలకు తీసుకెళ్లడంలోనూ, జిల్లా మొత్తాన్ని ప్రభావం చేయగలిగిన వారు ఈ 25 మందిలో కేవలం పది మంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారు రెండేళ్లు మంత్రిగా పనిచేసినా వారి నియోజకవర్గంలో గెలవడం కష్టమేనన్నది వాస్తవం. మరి జగన్ తన ఛరిష్మా ఉన్నప్పుడే కుల సమీకరణాలు వర్క్ అవుట్ అవుతాయి. అభ్యర్థుల మీద ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఆధారపడితే జగన్ అంచనాలు దారుణంగా ఫెయిలయినట్లే.