విజయవాడ, ఏప్రిల్ 12,
ఏదైనా ఒక పని చేయాలంటే ధైర్యం కావాలి. పార్టీ పై పట్టు ఉండాలి. అసంతృప్తులు తలెత్తకుండా చూసుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఆ తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడూ జరగలేదు. తెలుగుదేశం పార్టీలోనూ వైసీపీ మంత్రి వర్గ విస్తరణ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రి గా ఉన్న మూడు సార్లు ఇంత స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. బాబు హయాంలో.... చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు కానీ పూర్తి స్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. మంత్రుల అందరి చేత రాజీనామాలు చేయించలేదు. ఆయన లెక్కలు సపరేట్. సీనియర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. పార్టీని తొలి నుంచి నమ్ముకున్న వాళ్లు, సంక్షోభ సమయంలో తనకు అండగా నిలబడిన వారికే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు. చంద్రబాబు మంత్రివర్గంలో యనమల రామకృష్ణుడు, కోడెల శివప్రసాద్, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు వంటి వారు ఖచ్చితంగా ఉంటారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన.... దీంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం కల్పించి పార్టీలో తొలి నుంచి ఉన్న వారికి షాకులు ఇచ్చారు కూడా. అధికారంలో ఉండబట్టి అసంతృప్తులు తలెత్తలేదు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వంటి వారు బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేసినా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. 2014లో గెలిచిన తర్వాత వైసీపీ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం అప్పట్లో పార్టీలో చర్చనీయాంశమైంది. .. కానీ జగన్ మాత్రం ఇవేమీ చూసుకోరు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నో ఛాన్స్. కేవలం సామాజిక సమీకరణాలనే జగన్ నమ్ముకుంటున్నారు. తొలిదశ మంత్రివర్గ విస్తరణలోనూ ఊహించని వారికి మంత్రి పదవులు దక్కాయి. రెండో దశలోనూ అదే పరిస్థితి కన్పిస్తుంది. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు, జగన్ మంత్రివర్గ విస్తరణపై నేతలు బేరీజు వేసుకుంటున్నారు. పైకి అనలేకపోయినా జగన్ గట్స్ ను వారు అంతర్గతంగా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.