రాజమండ్రి, ఏప్రిల్ 12,
విద్యుత్తు కోతలతో కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అక్వా రైతులు బెంబేలెత్తుతున్నారు. రొయ్య పిల్లలను కాపాడుకోవడానికి రొటేవేటర్ల నిర్వహణకు డీజిల్ మోటార్లను వినియోగించాల్సి రావడంతో పడుతోన్న అదనపు భారంతో గగ్గోలు పెడుతున్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలో అధికారికంగా 55 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రొయ్యలకు మంచి ధర లభించింది. 30 కౌంట్‌కు రూ.610 చొప్పున అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పలికింది. ఈ నేపథ్యంలో వేసవి సాగు కూడా లాభాల పంట పండిస్తుందని రైతులు ఉత్సాహంగా ఆక్వా సాగు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా రోజుకు ఎనిమిది గంటలు అప్రకటిత విద్యుత్తు కోత విధిస్తుండడంతో వీరి ఆశలను నీరుగార్చాయి. రైతులు కనీసంగా ఐదు నుంచి పది ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఎకరాకు నాలుగు లక్షల రూపాయల వరకూ పెట్టుబడి అవసరమవుతుంది. వంద రోజుల తరువాత పంట చేతికి అందుతుంది. ప్రస్తుతం మూడు జిల్లాల్లో పంట 50 నుంచి 60 రోజుల మధ్యలో ఉంది. రొయ్యలకు మేత, మందులు, ఆక్సిజన్ వంటివి ఏమి తగ్గినా నష్టం లక్షల రూపాయల్లో ఉంటుంది. ఈ కారణంగా పంటను కంటికిరెప్పలా కాపాడుకోవాల్సి వస్తోంది. ఆక్సిజన్ శాతం తగ్గితే రొయ్యలు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో, రొయ్యలకు ఆక్సిజన్‌ను అందించేందుకు రొటోవేటర్లను 24 గంటలూ వినియోగంలో ఉంచుతారు. ఇవి విద్యుత్తుతో నడుస్తుంటాయి. ప్రస్తుతం విద్యుత్తు కోతల వల్ల రొటోవేటర్ల నిర్వహణకు డీజిల్ ఇంజిన్లను వాడుతున్నారు. పెద్ద రైతులు మాత్రం జనరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. డీజిల్ ఇంజిన్ ద్వారా రొటోవేటర్లను వినియోగించాలంటే ఒక ఎకరాకు గంటకు 30 లీటర్ల డీజిల్ అవసరం. ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ.106కు చేరింది. గంటకు రూ.3,180 డీజిల్‌కు ఖర్చు చేయాల్సి ఉంది. నిర్వహణ ఖర్చులు కలిపి గంటకు రూ.3,500 చొప్పున అదనపు ఖర్చు అవుతోంది. మూడు జిల్లాల్లో గంటకు రూ.19.25 కోట్లు అదనపు భారం పడుతోంది. ఎనిమిది గంటల పాటు కోతలు ఉంటే, రోజుకు రూ.154 కోట్ల వరకూ అదనపు భారం పడుతోంది.రోజుకు ఎనిమిది గంటలు రాత్రి వేళల్లో విద్యుత్తు కోత విధిస్తున్నారు. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నాను. విద్యుత్తు కోత వల్ల రోజుకు రూ.28 వేలు ఖర్చు పెరిగింది. పరిస్థితి ఇలాగే ఉంటే పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతాం. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అంతరాయాలు లేకుండా విద్యుత్తు సరఫరా అందించాలని కోరుతున్నారు.
పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
విద్యుత్తు కోతల ప్రభావం పారిశ్రామిక రంగంపై తీవ్రంగా పడింది. రోజురోజుకూ పెరిగిన విద్యుత్ కోతలతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది. దీంతో పారిశ్రామిక ప్రాంతమైన గ్రోత్ సెంటర్‌లో పరిశ్రమలకు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. గహ వినియోగాలకు విద్యుత్ కోతలు తగ్గించి పరిశ్రమలకు విద్యుత్ కోతలు పెంచింది ప్రభుత్వం. విద్యుత్ వినియోగం పెరిగినప్పటికీ ఉత్పత్తి పెరగక పోవడంతో విద్యుత్ కష్టాలు తప్పడం లేదని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు.
వారానికి ఒకరోజు పవర్ హాలీడే
పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలీడే ప్రభుత్వం ప్రకటించింది. విద్యుత్ ఆధారంగా మైతాన్, బెర్రీ, హిరా, సహారా, అరోరా వెంకటేశ్వర, సిరి, ఎండిఏ ఫెర్రో పరిశ్రమలు నడుస్తున్నాయి. వీటికి వారానికి ఒకరోజు పవర్ హాలీడే ప్రకటించారు. ఈనేపథ్యంలో కార్మికులపై తీవ్ర ప్రభావం పడనుంది. పవర్ హాలీడే రోజున కార్మికులకు పని దొరికే పరిస్థితి లేదు. దీంతో కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి విద్యుత్ పూర్తిగా సరఫరా చేయాలని కార్మికులు కోరుతున్నారు.
రోజుకు 12గంటలు మాత్రమే ఫుల్ లోడ్
గ్రోత్ సెంటర్లో ఫెర్రో పరిశ్రమలతో పాటు కెమికల్ పరిశ్రమలు, పేపర్ మిల్లు, బాయిలర్ ఇటుక తయారీ పరిశ్రమలు, సిమెంటు ఇటుక తయారీ, వర్క్ షాపులు, వాటర్ ప్లాంట్, గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమలకు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు లైట్లు, ఫ్యాన్లకు మాత్రమే విద్యుత్ వినియోగించాలని నోటీసులు జారీ చేశారు. ప్రతిరోజు సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఫెర్రో పరిశ్రమలు 50శాతం మాత్రమే విద్యుత్ వినియోగించాలి. దీంతో 12గంటలు పూర్తి లోడ్ తో పరిశ్రమలు నడవగా మిగిలిన 12గంటలు సగం లోడ్ తో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్పత్తి కూడా తగ్గిపోనుంది. కార్మికులకు పని లేకుండా పోవడంతో వారి ఉపాధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.