విజయవాడ, ఏప్రిల్ 12,
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. జనాభాలో 70 శాతం మంది ఆ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. జనాభాలో గణనీయ భాగంగా ఉండి సమాజాన్ని ఆర్థికంగా, మానవ వనరులపరంగా అభివృద్ధి పథంలో నడిపించాల్సిన యువత వ్యవసాయ కార్యకలాపాల పట్ల విముఖంగా ఉన్నారని, బొత్తిగా అటు వైపు ఆకర్షితులు కావడం లేదని వ్యవసాయ భూకమతాల (ల్యాండ్ హోల్డింగ్స్)పై ప్రభుత్వం నిర్వహించిన మూడవ దశ ఇన్‌పుట్ సర్వే (2016-17)లో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 85.19 లక్షల కమతాలుండగా కేవలం 2.29 లక్షలు మాత్రమే 18-30 సంవత్సరాల వయసు కలిగిన వారి చేతుల్లో ఉన్నాయి. అసలు 18 సంవత్సరాల లోపు కమతాలు లేనే లేవు. రైతు సగటు వయసు 49 ఏళ్లకుపైనే. రైతుల్లో మధ్యస్థ వయస్కులే అత్యధికం. 41-50 ఏళ్ల లోపు వారు 31.54 లక్షలు. మొత్తం రైతుల్లో వీరే గణనీయం. వీళ్ల వాటా 37.02 శాతం. ఆ తర్వాత 51-60 ఏళ్ల లోపు రైతులు 25.78 లక్షలు. మొత్తం రైతుల్లో వీరి వాటా 30.26 శాతం. 41-50, 51-60 రెండు కేటగిరీలూ కలిపితే 57.32 లక్షల కమతాలు. ఇక 61-65 ఏళ్ల లోపు రైతులు 6.77 లక్షలు (7.94 శాతం) కాగా, 66 సంవత్సరాలకు పైబడిన వారు 5.41 లక్షలు (6.35 శాతం).18-30 ఏళ్ల లోపు రైతులందరూ కలుపుకొని 2.29 లక్షలుండగా వారిలో సన్నకారు రైతులే ఎక్కువ. 1.56 లక్షల మంది వారే. ఆ ఏజ్ గ్రూపులో గల మొత్తం రైతుల్లో సన్నకారు వాటా 68.15 శాతం. 31-40 ఏజ్ గ్రూపులో సైతం సన్నకారు రైతులే ఎక్కువ. మొత్తం ఆ ఏజ్ గ్రూపులో 13.41 లక్షల మంది ఉండగా, 9.57 లక్షల మంది (71.40 శాతం) సన్నకారు రైతులే.మిగతా కేటగిరీలతో పోల్చితే మధ్యతరగతి, పెద్ద రైతుల వయసు ఎక్కువ. రైతు సగటు వయసు 49.05 ఏళ్ల నుంచి 52.88 ఏళ్లు కాగా, మీడియం రైతుల సగటు వయసు 51.95 సంవత్సరాలు, పెద్ద రైతుల సగటు వయసు 52.88 ఏళ్లు.మొత్తం రైతుల్లో నిరక్షరాస్యులు 23.24 లక్షలు కాగా, వారిలో సన్నకారు రైతులు 16.85 లక్షలు (72.49 శాతం), చిన్న రైతులు 4.17 లక్షలు (17.94 శాతం). ఐదవ తరగతి లోపు చదువుకున్న మొత్తం రైతుల సంఖ్య 19.05 లక్షలు కాగా, చిన్న రైతులు 3.39 లక్షలు. ఏడో తరగతి లోపు రైతులు 20.04 లక్షలు. రైతుల్లో డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదువుకున్నవారు 2.65 లక్షలు. వారిలోనూ సింహభాగం సన్నకారు రైతులే.