YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మండుతున్న సూరీడు

మండుతున్న సూరీడు

 జగిత్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు ప్రచంఢ రూపం దాల్చడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. మొన్నటి వరకు వర్షాలు పడటంతో చల్లగా ఉన్న జిల్లా మూడు రోజులుగా ఉష్ణోగ్రతల తీవ్రతకు ఉడికి పోతోంది. ఉదయం 7గంటల నుంచే ఎండ మండిపోతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోజుకు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ఉక్కపోతతో సతమతమవుతున్నారు. వేడిమి ధాటికి రహదారులన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా 42 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 9 గంటల లోపే 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయానికి వేడిమి మరింతగా పెరిగిపోతుండడంతో జనాలు అత్యవసర పనులుంటేనే కాలు బయటపెడుతున్నారు. ఏసీలు, కూలర్లు ఉన్నవారు కొంత స్థిమితంగానే ఉన్నా ఈ తరహా సౌకర్యం లేని వారు అల్లాడిపోతున్నారు. 

 

జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు ఎండల ధాటికి నానాపాట్లు పడుతున్నారు. అత్యవసర పని ఉంటేనే తప్ప ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రావడం లేదు. ఇక కూలి పనులకు వెళ్లేవారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. వారు ఎండ దెబ్బను తప్పించుకోలేకపోతున్నారు. చెట్ల నీడన సేద తీరుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే బస్టాండ్లలో జనాల రద్దీ గణనీయంగా తగ్గింది. అనేకప్రాంతాల్లో రోడ్లు బోసిపోతున్నాయి. కొన్ని రోజులు పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అత్యవసర పనులుంటే తప్ప బయటకు వెళ్లకూడదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. కాలుష్యం, ఓజోన్ పొర దెబ్బతినడంతో కొంతకాలంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు అధికంగా పెంచితే ఈ సమస్యను కొంత అధిగమించే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇదిలాఉంటే ఉష్ణతాపానికి ఇప్పటికే పలువురు అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఎండలకు ప్రజారోగ్యం మరింతగా ప్రభావితం కావచ్చని అంతా భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. 

Related Posts