YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అన్నదాతలకు తప్పని తంటాలు

అన్నదాతలకు తప్పని తంటాలు

ధాన్యం కొనుగోళ్లలో పలు స్థాయిల్లో అక్రమాలు సాగుతున్నాయని కరీంనగర్ రైతాంగం వాపోతోంది. అవకతవకల కారణంగా తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలకు పలు సమస్యలు ఎదుర్కొన్న అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అక్రమాలు తప్పించుకోలేక సతమతమవుతున్నారు. జిల్లాలో 175 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ ప్రహసనంగానే సాగుతోంది. ప్రణాళిక లేకపోవడం వల్ల చాలాకేంద్రాల్లో తెచ్చిన ధాన్యం విపరీతంగా నిల్వ ఉంటున్నాయి. దీంతో ఒక్కో రైతులు నాలుగైదు రోజుల నుంచి వారం పదిరోజులపాటు కేంద్రం వద్దనే పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. దాదాపు నెలరోజులుగా ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతుండడంతో రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఎప్పటికప్పుడు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఇప్పుడున్న దానికి అదనంగా కొనుగోళ్లు జరిగే వీలుండేది. కానీ కొనుగోళ్లు ఆలస్యమవుతుండడం సమస్యాత్మకంగా మారింది. దీనికితోడు అకాల వర్షం వస్తే తడిసిన ధాన్యం రూపంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికే నెల రోజుల్లో ఏడెనిమిది రోజుల పాటు అన్నదాతలు తమ రెక్కల కష్టాన్ని నీటి పాలు చేసుకున్న దుస్థితి. సరైన రక్షణ చర్యలు లేకపోవడమే కాక ధాన్యాన్ని రక్షించుకునేందుకు టార్ఫలిన్లు అందివ్వకపోవడంతో నష్టం అధికంగా ఉంది. రైతులు ఆర్ధికంగా నష్టాలు మూటగట్టుకున్నారు.  

కొన్నిచోట్ల తూకం విషయంలో అన్నదాతలు మోసపోతున్నారు. తూకంలో అక్రమాలు ప్రశ్నించలేక మౌనంగానే ఉండిపోతున్నారు. రైతుల మౌనాన్ని క్యాష్ చేసుకుంటూ పలువురు గన్నీ సంచి బరువు సహా అదనంగా తరగు పేరిట కొన్నిచోట్ల ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని కాంటమీదకు తీసుకెళ్తున్నారు. బస్తాలో 40కిలోలకు అదనంగా ఒకటి నుంచి రెండు కిలోలు తూకం వేస్తున్నారు. సామాన్య రైతుల దుస్థితి ఇలా ఉంటే.. బడారైతులకు మాత్రం ఎలాంటి సమస్యలు ఉండడంలేదని సమాచారం. పేరున్న రైతులు తెచ్చిన ధాన్యాన్ని సిబ్బంది వెంచనే కొనుగోలు చేస్తున్నారని బడుగు రైతులు ఆరోపిస్తున్నారు. చిన్నరైతులవి కొనుగోలు సమయంలో మాత్రం కొర్రీలు తప్పడంలేదని అంటున్నారు. తడిసిన ధాన్యమని, మరికొంతసేపు ఆరబెట్టాలనే లేని నిబంధనలన్నీ తమనే వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు తరచూ ఆదేశాలిస్తున్నారు. అయితే క్ష్రేతస్థాయిలో మాత్రం తీరు మారడం లేదు. ఎలాగోలా ప్రక్రియను కానిచ్చేద్దామనే ధోరణి కొనుగోలు సిబ్బందిలో కనిపిస్తోంది. ఫలితంగా సామాన్య రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికార యంత్రాంగం స్పందించి ధాన్యం కొనుగోళ్లు పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. బడుగు రైతు నష్టపోకుండా కొనుగోళ్లు నిర్వహించాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

Related Posts