బెంగళూరు, ఏప్రిల్ 15,
కర్నాటకలో ఎప్పుడూ హాట్ హాట్ రాజకీయాలు నడుస్తుంటాయి. తాజాగా మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాకిచ్చింది. అత్యంత వివాదాస్పదుడిగా, అవినీతిపరుడిగానూ పేరుపొందిన బీజేపీ మంత్రి ఈశ్వరప్పపై బీజేపీ వేటేసింది. మంత్రిగా ఉండి మతఘర్షణలకు ఊతమిస్తున్నారనే విమర్శలకు తోడు సామాన్యులను బెదిరించి, వారి మరణాలకూ కారకుడవుతున్నారని ఈశ్వరప్పపై అనేక ఆరోపణలున్నాయి. తాజాగా సంతోష్ పాటిల్ అనే గవర్నమెంట్ రోడ్డు కాంట్రాక్టర్ ఆత్మహత్య ఉదంతం దేశాన్ని కుదిపేసింది.దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ వివాదంపై సీఎం స్పందించారు. దీనిపై వస్తున్న తీవ్ర వత్తిడుల నేపథ్యంలో ఈశ్వరప్పను కేబినెట్ నుంచి తప్పించేందుకు సిద్దమైంది బొమ్మై ప్రభుత్వం. ఆయనపై కేసు నమోదు తర్వాత పరిణామాలు వేగంగా మారడంతో ఈశ్వరప్ప తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్పతోపాటు ఆయన సహాయకులు బసవరాజ్, రమేష్ లపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని ఉడిపి పట్టణంలోని ఓ లాడ్జిలో కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ శవమై కనిపించాడు. నాలుగు కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ పనుల్లో తన వద్ద నుంచి లంచంగా మంత్రి, అతని సహాయకులు 40శాతం డిమాండ్ చేశారు. ఈ వత్తిడి తట్టుకోలేక తాను చనిపోతున్నట్టు సూసైడ్ లేఖలో రాయడంతో మంత్రి పై కేస్ బుక్ అయ్యింది. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కు మంత్రి వేధింపులే కారణమని మృతుడి సోదరుడు ప్రశాంత్ పాటిల్ కూడా ఆరోపించారు.అయితే సంతోష్ పాటిల్ ఆత్మహత్య పై కాంగ్రెస్ మండిపడింది. విధాన సభ ముందు కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ..మరియు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చాంబర్ వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఈశ్వరప్ప పేరు ఉన్నా.. మంత్రిని అరెస్ట్ చేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు వారు ఆరోపించారు.