YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ టీమ్ 2పై సజ్జల మార్క్...

జగన్ టీమ్ 2పై సజ్జల మార్క్...

విజయవాడ, ఏప్రిల్ 16,
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 కేబినెట్ లోని మంత్రులు ఒక్కొక్కరూ తమకు కేటాయించిన చాంబర్లలో పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రెండో కేబినెట్ లో స్థానం దక్కించుకున్న తొలి మంత్రివర్గంలోని మంత్రులు సంతోషంగా ఉన్నారు. కేబినెట్ లో కొనసాగింపు లభించని పలువురు తాజా మాజీ మంత్రులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అలాంటి వారిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు బుజ్జగిస్తున్నారు.అయినా మరీ పట్టు వీడకుండా పంతం పట్టి కూర్చున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వారిని నేరుగా జగన్ రెడ్డి రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. ఇక తాజా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా గత కొద్ది రోజులుగా అలక పాన్పు ఎక్కడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ అందజేశారు. కానీ.. ఏమి జరిగిందో ఏమో బుధవారంనాడు ఆమె నేరుగా సీఎం జగన్ తో చర్చలు జరిపారు. జగన్ రెండో కేబినెట్ లో స్థానం కోసం పరితపించిన సీనియర్ ఎమ్మెల్యేలు కొందరు మీడియా సాక్షిగా భోరున విలపించారు. మరికొందరు కన్నీరు మున్నీరయ్యారు.ఇదిలా ఉండగా.. జగన్మోహన్ రెడ్డి రెండో కేబినెట్ కూర్పులో ‘అంతా మీరే చేశారు’ అనే తీరులో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించిన తీరు గురించే బాగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గం కూర్పు అంతా సజ్జల రామకృష్ణారెడ్డి నిర్ణయం ప్రకారమే జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ రెడ్డి పూర్తిగా సజ్జలపైనే ఎందుకు ఆధారపడాల్సి వచ్చిందనే సందేహాలు కూడా పలువురి నుంచి వస్తున్నాయి. జగన్ రెడ్డి తొలుత తన రెండో కేబినెట్ పూర్తిగా పాతవారిని తొలగించి, కొత్త వారితో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముందుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మొత్తం 11 మంది పాత మంత్రులకు కొత్త కేబినెట్ లో బెర్త్ లు దొరికాయి. అలా మళ్లీ మంత్రి పదవులు లభించిన పాతవారిలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొనసాగింపు ఇవ్వడం వెనుక ఏదో భయం ఉందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇక బుగ్గన విషయానికి వస్తే ఆర్థిక మంత్రిగా ఆయనను కొనసాగించడం తప్పనిసరి అని భావించడమే కారణం అంటున్నారు.అంతకు ముందు అంతా కొత్తవారినే కేబినెట్ తీసుకునే ఛాన్స్ ఉందంటూ మీడియాకు లీకులు ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత 11 మంది పాతవారిని కొనసాగించడంలో ప్రముఖ పాత్ర వహించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో పాటు కొత్తవారికి పదవులు లభించిన వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గురించి. ఆమె మాటకారితనం, పనితనం, సేవాకార్యక్రమాలతో పాటు తనతో కాస్త ఎక్కువ చనువుగా ఉండడం వల్లే రజినికి సజ్జల రామకృష్ణారెడ్డి కేబినెట్ బెర్త్ కన్ఫామ్ చేయించారనే వార్త ఒకటి పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.నిజానికి కేబినెట్ లో ఎవరిని ఉంచాలి? ఎవరెవరినీ కొత్తవారిని తీసుకోవాలి? అనే విషయంలో సీఎం జగన్ కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే.. ఎప్పుడైతే కేబినెట్ కూర్పులో సజ్జల రామకృష్ణారెడ్డి సహాయం తీసుకోవడం, గంటల తరబడి ఆయన ఒక్కడితోనే సమాలోచనలు చేయడం వెనుక ఏదో ఆంతర్యం ఉండి ఉంటుందనే అనుమానాలు పలువురి మధ్య చర్చకు వస్తున్నాయి. అసలు సీఎం జగన్ ఇంతలా సజ్జల మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గం ఎంపికలో జగన్ రెడ్డి అభీష్టం కంటే సజ్జల ఇష్టానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అలాగే మంత్రిత్వశాఖల కేటాయింపు విషయంలో కూడా సజ్జలే ప్రముఖ పాత్ర వహించారంటున్నారు. ఏదో భయంతో బొత్స సత్యనారాయణ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు కొనసాగింపు ఇచ్చినా.. అంతకు ముందరి కంటే ప్రాధాన్యం లేని శాఖలు కట్టబెట్టారనే అసంతృప్తి కూడా వారిలో ఉందంటున్నారు.కేబినెట్ బెర్త్ కొనసాగింపు లేక అలక వహించిన పాత మంత్రుల్ని బుజ్జగించడంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నడుంకట్టుకుని రంగంలోకి దిగడం ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో అయితే పలుమార్లు సజ్జల రామకృష్ణారెడ్డే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించే ప్రయత్నం చేయడం విశేషం. కేబినెట్ కూర్పులో తన మార్కు ఉన్నందువల్లే సజ్జల ఇలా ప్రతి విషయానికీ తెరమీదకు వస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద ఏపీ కొత్త కేబినెట్ కూర్పు చూస్తే.. ‘అది సజ్జల టీం’ అనే సందేహం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Posts