నెల్లూరు, గుంటూరు, ఏప్రిల్ 16,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత కాలం ఏదైతే తన బలం అని చెప్పుకుంటూ వచ్చిందో అదే పెద్ద బలహీనత అని ఇటీవలి మంత్రి వర్గ విస్తరణ తేటతెల్లం చేసేసింది. ఇంకెంత మాత్రం ఆ పార్టీ తన బలం గురించీ.. 151 మంది సభ్యుల బలగం గురించీ జబ్బలు చరుచుకునే అవకాశం లేదు. పార్టీలో ఐక్యత అన్నది మంత్రి వర్గ విస్తరణతో నీటి బుడగలా పేలిపోయింది. ఇంత కాలం జగన్ మాటే శిలా శాసనంగా అనుకుంటూ వచ్చిన వారందరికీ అది భ్రమే అని విస్తరణ అనంతర పరిణామాలు తేటతెల్లం చేసేశాయి. రాజుగారి దేవతా వస్త్రాల భ్రమలు పటాపంచలు చేసేశాయి. అసలింతకీ పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమనడానికి కారణం ఏమిటి? విస్తరణలో పదవులు దక్కకపోవడమేనా?.. లేదా పదవి ఊడిపోవడమేనా? పార్టీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలను గమనిస్తే.. అదొక్కటే కారణం కాదని తేలుతుంది. అధినేత జగన్ విశ్వసనీయత మసకబారడం కూడా ఒక కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.పార్టీలో అధినేతకు సన్నిహితులుగా పేరుపడ్డ వారు సైతం అసంతృప్తితో రగిలిపోతుండడానికి కారణం ఏమిటి? ఒక్క సారిగా పార్టీ అత్యంత బలహీనంగా మారిపోయిందని అనిపించే పరిస్థితి ఎందుకొచ్చింది. పార్టీ వర్గాలయితే ఇందుకు అధినేత జగన్ దే పూర్తి బాధ్యత అనీ, ఈ పరిస్థితికి ఆయనే కారణమనీ అంతర్గత సంభాషణల్లో కుండ బద్దలు కొట్టేస్తున్నారు. 2019లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చెప్పినట్లుగా రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ సహచరులందరినీ మార్చి కొత్త టీంను ఎన్నుకున్నట్లైతే పార్టీలో ఇంతటి స్థాయిలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడేవి కావని అంటున్నారు. అయితే ఈ మూడేళ్లుగా జగన్ తన కేబినెట్ సహచరుల పనితీరును ఎసెస్ చేసినట్లు ఎక్కడా కనిపించదు. వారు తమ శాఖపై పట్టు సాధించే అవకాశమూ ఇవ్వలేదు. అసలు వారికి పని చేసే అవకాశమే లేకుండా చేశారు. ఆమాత్య పదవి కేవలం అలంకారమన్న చందంగా వారి పదవీయోగం సాగింది. ఈ విషయాన్ని అంతర్గత సంభాషణల్లో పలువురు మంత్రులు అంగీకరించిన దాఖలాలు ఉన్నాయి. ఏప్పుడో తప్ప మంత్రులకు తమ శాఖలకు సంబంధించి విలేకరుల సమావేశాల్లో మాట్లాడే అవకాశమేరాలేదు. అంతా రాజకీయ సలహాదారు సజ్జలే కానిచ్చేసేవారు. ఇక వివిధ శాఖలకు సంబంధించిన సమీక్షల వ్యవహారమంతా జగన్ స్వయంగా చేసేవారు. ఆయా సమీక్షా సమావేశాల్లో ఆయా శాఖల మంత్రుల పాత్ర ఉత్సవ విగ్రహాల కంటే కొంచం తక్కువే. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదవులు కోల్పోయిన వారు అసలేం చేయనిచ్చారని, పని చేయలేదంటూ తప్పించారు? ఉన్న వాళ్లేం చేశారని పని తీరు బాగుందంటూ కొనసాగించారంటూ నిలదీస్తున్నారు. ఇక కొద్దో గొప్పో విలేకరుల సమావేశాల్లో విపక్షనేతనూ, విపక్ష నేత తనయుడినీ విమర్శల పేరు చెప్పి దూషణల పర్వానికి తెరలేపుతూ నిత్యం వార్తల్లో ఉన్న కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు.. అలాగే ఉన్నంతలో ప్రభుత్వ విధానాలకు మీడియాకు తెలియజేస్తూ వచ్చిన పేర్ని నానీ వంటి వారికీ పునర్వ్యవస్థీకరణలో వేటు పడింది. దీనిని బట్టి చూస్తేనే.. ఏలాంటి హేతు బద్ధతా లేకుండానే పనర్వ్యవస్థీకరణ తంతును జరిపించారని భావించాల్సి వస్తున్నది. ఆ కారణంగానే ఉద్వాసనకు గురైన వారిలోనే.. ఆశించి భంగపడిన వారిలోనూ ఒక్కసారిగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ధిక్కార స్వరం సౌండ్ పెరిగింది. ఆ సీరియస్ నెస్ ను ఆలస్యంగా గమనించిన పార్టీ అధినేత చేతులు కాలితేనేం.. ఆకులుపట్టుకుని నష్ట నివారణ చేద్దాం అన్న చందంగా చివరి నిముషం వరకూ కేబినెట్ సభ్యుల జాబితాలో మార్పులూ, చేర్పులూ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఏం చేసినా జరగాల్సిన నష్టం జరగిపోయంది. బుజ్జగింపుల అనంతరం అసంతృప్తి చల్లారిందని ఎంతగా చెప్పుకుంటున్నా.. అదంతా నివురుగప్పిన నిప్పుచందమే.