YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సొంత సామాజిక వర్గం నుంచే తిరుగుబాటా...

సొంత సామాజిక వర్గం నుంచే తిరుగుబాటా...

నెల్లూరు, ఏప్రిల్ 16,
ఆంధ్రప్రదేశ్ లోని పెద్దారెడ్లు ఏకమవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణను భారీగా సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇంతకాలం సమయం కోసం ఎదురుచూసిన పెద్దారెడ్లు ఇప్పుడు జగన్ పై దండయాత్రకు సమాయత్తం అవుతున్నారు. మంత్రివర్గ విస్తరణ తరువాత జగన్ కు చుక్కలు చూపించాలని నెల్లూరు పెద్దారెడ్లు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుండీ ఆ సామాజికవర్గ నేతలు జగన్ కు అంతా తామై పార్టీని నడిపించారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుడెవరైనా పక్క పార్టీలో ఉంటే నయానో భయానో చెప్పి జగన్ పంచన చేరేలా చేశారు. ఆనం రామనారాయణరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు జగన్ కు దూరంగా ఉన్నా 2019 ఎన్నికల నాటికి అందరూ ఏకమయ్యారు. రెడ్డి రాజ్యం రావాలంటే జగన్ గెలవాలనే నినాదంతో ముందుకెళ్లారు. ఫలితం అనుకున్న దాని కంటే ఆరు రెట్లు ఎక్కువగానే వచ్చింది.సీన్ కట్ చేస్తే.. రెడ్డి రాజ్యం వచ్చింది.. కాని.. రెడ్లు ఏలడానికి రాజ్యం లేకుండా జగన్ చేశారు అంటున్నారు. ఇతర సామాజికవర్గాల చోటా నేతలకు బడా పదవులు కట్టబెట్టి.. తమను జగన్ తీవ్రంగా అవమానించారనే భావం పెద్దారెడ్లలో గూడుకట్టుకుపోయింది. ఈ మధ్య కాలంలో రాయలసీమకు చెందిన ఓ నేత ‘సమయం లేదు మిత్రమా.. త్వరగా కలుద్దాం.. కార్యాచరణ సిద్ధం చేద్దామ’ని నెల్లూరు, ఒంగోలు, రాయలసీమ ప్రాంతాల పెద్దారెడ్లను ఏకం చేసే పనిలో పడ్డారట. అందుకు మంత్రివర్గ విస్తరణ తరువాత తమ విశ్వరూపం జగన్ కు చూపించాలని నిర్ణయం తీసుకుంటున్నారట. మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డిన వారంతా జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఏకం అవుతున్నారని తెలుస్తోంది. అసలు జగన్ కు పెద్దారెడ్లకు అంత పెద్ద గ్యాప్ ఎందుకొచ్చింది..? రాజకీయ పదవుల కోసమే కాదు.. ఆర్థిక వెసులుబాటు కోసం కూడా తాము ఏకం కాక తప్పలేదని పెద్దారెడ్లు చెబుతున్నారు. ఆదాల,  మాగుంట, ఆనం, డీఎల్ ఫ్యామిలీలను వైసీపీలో చేర్చుకోవడంతో జగన్ కు మరింత బలం వచ్చినట్లయింది. ఎన్నికల అనంతరం ముందుగా మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆర్ధిక మూలాలను దెబ్బతీసే విధంగా ఒంగోలు దగ్గర లిక్కర్ ఫ్యాక్టరీ మూతపడేలా జగన్ చేశారు. ఆ తరువాత ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోగా.. ఆయన రాజకీయభిక్ష పెట్టిన అనిల్ కు మంత్రి పదవి ఇచ్చి ఆనంను అనిల్ చేత అవమానపరిచేలా జగన్ ప్రవర్తింపచేశారనే ఆగ్రహం ఉంది. ఇక ఆదాల, మహీధర్ రెడ్డి, డీఎల్ రవీంద్ర రెడ్డిలను కూడా జగన్ చాలా చిన్నచూపు చూశారంటారు.ఇలా అవమానాలు భరించి, సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకేను జగన్ రెడ్డి గెలికారు. జీవీకే నెల్లూరు జిల్లా వాసి. మాజీ రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి బంధువు కూడా. ఆనం, ఆదాల లాంటి వారికి సన్నిహితుతుడు జీవీకే. అలాంటి జీవీకే ఆర్దిక ములాలను జగన్ దెబ్బకొట్టారు. దీంతో జీవీకేకు కోపం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో పెద్దారెడ్లు అందరినీ ఏకంచేసే పనిలో జీవీకే పడ్డారు. ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టి, అందరినీ ఒకతాటిపై తేవాలని రాజకీయ దిగ్గజం ఆనం రామనారాయణరెడ్డిని జీవీకే కోరారట.ఈ క్రమంలోనే ఈ సారి టీడీపీలో చేరి జగన్ ను ఇంటికి పంపించాలని వారు చాలా సీరియస్ గా చర్చలు జరిపారని సమాచారం. ఆ చర్చలు పూర్తిగా సఫలం కావడంతో పెద్దారెడ్లకు మరింత ఊపొచ్చిందంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ కీల‌క రెడ్డి నేత‌ల‌కు తీవ్ర అన్యాయం జ‌ర‌గ‌డంతో.. ఇక ఊరుకునే ప్ర‌స‌క్తే లేద‌ని అంటున్నారు. జిల్లాల వారీగా తిరిగి మిగిలిన రెడ్లను కూడా ఏకంచేసి జగన్ పై దండయాత్ర చేసేందుకు సర్వం సిద్దం చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ మధ్య కాలంలో ఈ నేతలందరూ చంద్రబాబుతో కూడా రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా ఎవరేం చేయాలనే రోడ్ మ్యాప్ కూడా పెద్దారెడ్లు రెడీ చేశారట. జ‌గ‌న్ హ‌యాంలో తీవ్ర ఇబ్బందులకు గురైన పెద్దారెడ్లందరూ టీడీపీలో చేరడం ఖాయమని, ఇక వైసీపీ ఖేల్ ఖతం అనే చర్చ ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది.

Related Posts