తిరుపతి, ఏప్రిల్ 16,
రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సౌరవిద్యుత్‌పై దృష్టి సారించింది. ప్రధానంగా ప్రభుత్వ సంస్థల్లో సౌర విద్యుత్‌ను వినియోగించేలా అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మదనపల్లె ఆర్టీసీ –1, 2 డిపోలు, గ్యారేజీలు, బస్‌స్టేషన్, జెడ్పీహైస్కూల్ ప్రాంగణాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. వీటిద్వారా వస్తున్న విద్యుత్‌ను ఆ సంస్థలు సమర్థవంతంగా వినియోగించుకుంటూ నెలనెలా వస్తున్న కరెంటు బిల్లుల నుంచి ఉపశమనం పొందాయి. మదనపల్లెలో సౌర వెలుగులపై ప్రత్యేక కథనం. తన ఆస్తులను మరింత సమర్థవంతంగా సద్వి నియోగం చేసుకునే వ్యూహంలో భాగంగాఆర్టీసీ సౌర విద్యుత్ బాట పట్టింది. బస్ స్టేషన్, డిపోలు, గ్యారేజీ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నాలుగు డిపోలను ఎంపిక చేశారు. అందులో భాగంగా 2018లో మదనపల్లె ఆర్టీసీ డిపోలో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేశారు. 100 కిలో వాట్ల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ.37 లక్షల వరకు వెచ్చించారు. ప్లాంటు ద్వారా నెలకు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.సుమిత్ సంస్థ టెండర్ ద్వారా ఆర్టీసీకి 25 ఏళ్లపాటు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తోంది. వీటి ద్వారా బస్‌స్టేషన్, రెండు డిపో కార్యాలయాలు, గ్యారేజీలో సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. 1, 2 డిపో కార్యాలయాలపై 326 పలకలను ఏర్పా టు చేశారు. గతంలో విద్యుత్ బిల్లు నెలకు రూ.1.50 లక్ష వరకు వచ్చేది. సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసిన తరువాత నెలకు సరాసరి రూ.40–50 వేలు బిల్లు వస్తోంది. సగటున నెలకు రూ.లక్ష వరకు ఆదా అవుతోంది. గత 5 సంత్సరాలుగా సోలార్ ప్లాంటు విజయవంతంగా నడుస్తోంది. మదనపల్లె ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంటు సక్సెస్ కావడంతో రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. త్వరలో అన్ని డిపోల్లో ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు.