YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

తమిళనాడులో గవర్నర్ జగడం

తమిళనాడులో గవర్నర్ జగడం

చెన్నై, ఏప్రిల్ 16,
రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ  ఆ వ్యవస్థలు మరింత మెరుగ్గా పటిష్టంగా పని చేయడానికి దోహదపడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతుంది.  కానీ ఆ ఘర్షణ రాజకీయ ప్రయోజనాల కోసం అయితే మాత్రం ఆ వ్యవస్థలు భ్రష్టు పట్టడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించదు. తాజాగా తమిళనాడు సర్కార్, ఆ రాష్ట్ర గవర్నర్ల మధ్య రాజుకున్న వివాదం, అలాగే కేసీఆర్ సర్కార్, ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై మధ్య పెరిగిన దూరం రెండో కోవకే చెందుతాయి. అలాగే పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం - ఆ రాష్ట్ర రాజ్ భవన్ మధ్య కూడా అగాధమే నెల కొని ఉంది. అసలు రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ ల మధ్య ఘర్షణ  పూరిత వైఖరి ఎందుకు నెలకొంటున్నది? ఇందుకు కారణాలేమిటి? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం ఒక్కటే. ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడటానికి బయటకు కనిపించే కారణాలేమైనా కావచ్చు.. అసలు కారణం మాత్రం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల మధ్య ఉన్న వైరుధ్యాలే. రాజకీయ విభేదాలే. ఇందుకు సందేహం ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రాలు, రాజ్ భవన్ మధ్య సంబంధాలు స్మూత్ గానే ఉంటున్నాయి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే పార్టీ అధికారంలో ఉన్నరాష్ట్రాలలో మాత్రం ఆయా ప్రభుత్వాలకు రాజ్ భవన్ తో పొసగని పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణ విషయం తీసుకుంటే రాజ్ భవన్, తెరాస సర్కార్ విభేదాలు  హస్తిన చేరాయి. స్వయంగా గవర్నర్ తమిళసై తెరాస సర్కార్ తీరుపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అంతటితో ఆగకుండా.. విలేకరుల సమావేశంపెట్టి మరీ తనను కేసీఆర్ సర్కార్ అవమానిస్తున్నదంటూ.. విమర్శలు గుప్పించారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు. అసలు రాజ్ భవన్ కూ, సర్కార్ కు మధ్య అగాధం ఏర్పడటానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి ప్రభుత్వం సిఫారసు చేసిన వ్యక్తిని గవర్నర్ ఆమోదించకుండా వెనక్కు పంపడమేనన్నది బయటకు చెబుతున్న కారణం. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాజ్ భవన్ బీజేపీ  కార్యాలయంలా పని చేస్తున్నదంటూ విమర్శలు గుప్పిస్తున్నది. ఇక తమిళనాడు విషయానికి వస్తే నీట్ మినహాయింపునకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును  గవర్నర్  తిప్పిపంపారు.  వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్ ను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. నీట్ వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, ప్రైవేటు ట్యూషన్లు, కోచింగ్ లు తీసుకోగలిగిన సంపన్న కుటుంబాల విద్యార్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతోందన్నది తమిళనాడు సర్కార్ వాదన, నీట్ లో ఫైయిలై తమిళనాట పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా తమిళనాడు సర్కార్ ప్రస్తావించింది. అయితే నీటి మినహాయింపు బిల్లును గవర్నర్ తిప్పి పంపడంతో తమిళనాడు ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలో మరో బిల్లు రూపొందించింది. అసెంబ్లీలో దానిని ఆమోదించి గవర్నర్ కు పంపింది. గవర్నర్ ప్రభుత్వం పంపిని బిల్లును రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటేసమీక్ష కోసం తిప్పి పంపించాలి. కానీ తమిళనాడు గవర్నర్ ఆ రెండూ చేయలేదు. బిల్లును తన వద్దే ఉంచుకుని నిర్ణయం వెలువరించకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో  అనివార్యంగా బిల్లును అసెంబ్లీకి పంపారు. గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ డీఎంకే ఎంపీలు పార్లమెంటులో చర్చకు కూడా పట్టుబట్టారు. ఈ విషయంపై వివాదం అలాగే ఉన్న సమయంలో తమిళనాడు గవర్నర్ బిల్లుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఇటు తెలంగాణ సర్కార్, అటు తమిళనాడు సర్కార్ కూడా రాజ్ భవన్ (గవర్నర్) కేంద్ర ప్రభుత్వఆదేశాలకు పని చేస్తున్నాయని విమర్శిస్తున్నాయి. గవర్నర్ లు రాష్ట్రంలో కేంద్రం ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తమ రాజకీయ  ప్రయోజనాల పరిరక్షణకు దోహదపడేందుకు వీలుగా గవర్నర్ వ్యవస్థను వడుకుంటోందన్న ఆరోపణలు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచీ వినవస్తున్నయి. గవర్నర్ వ్యవస్థపై రాష్ట్రల వ్యతిరేకత ఈ రెండు రాష్ట్రాలతోనే మొదలు కాలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్ర గవర్నర్ మోడీ సర్కార్ ఏజెంట్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో దివంగత ఎన్టీఆర్ కూడా గవర్నర్  వ్యవస్థ అనవసరం అంటూ నినదించిన సంగతి తెలిసిందే.  నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా అప్పట్లో ఆయన గవర్నర్ల వ్యవస్థ రద్దు చేయాలంటూ జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపారు. మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉంటే ఆయా రాష్ట్రాలలో గవర్నర్ల తీరు వివాదాస్పదంగా  మారుతున్నది. ఈ పరిస్థితి తలెత్తకుండా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులను గవర్నర్ లుగా నియమించే సంప్రదాయానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది.

Related Posts