హైదరాబాద్, ఏప్రిల్ 16,
తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. పబ్ లలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఖరీదైన డ్రగ్స్ నగరంలో ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నాయి. బంజారా హిల్స్ రాడిసన్ హోటల్ లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ దొరికిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ డ్రగ్స్ పై ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ ని అరికట్టేందుకు పటిష్టమయిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే డ్రగ్ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించింది.
నోట్లోని లాలాజలంతో టెస్ట్ నిర్వహిస్తారు. దీని ద్వారా రెండునిమిషాల్లో రిజల్ట్ వచ్చేస్తుంది. పాజిటివ్ వస్తే మూత్రం, రక్త పరీక్షలతో నిర్ధారణకు వస్తారు. కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఈ తరహా విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. డ్రగ్ టెస్ట్‌లు నిర్వహణకు హైదరాబాద్ పోలీసులు కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది.డ్రంక్ అండ్ డ్రైవ్ లో బ్రీత్ అనలైజర్లు ఉపయోగించడం తెలిసిందే. అదే తరహాలో డ్రగ్స్ వినియోగదారులను గుర్తించేందుకు డ్రగ్ అనలైజర్లు వినియోగించనున్నారు. డ్రగ్ అనలైజర్లతో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను అధ్యయనం చేయనుంది హైదరాబాద్ పోలీస్ శాఖ. డ్రగ్ తీసుకుంటే ఎరుపు రంగులో, లేకపోతే ఆకుపచ్చ రంగులో చుక్కలు వస్తాయి. ఈ డ్రగ్ అనలైజర్ పరీక్షలోపాజిటివ్ వస్తే మూత్రం, రక్త పరీక్షలు నిర్వహించి ఒక నిర్దారణకు వస్తారు. గంజాయి, హాష్ ఆయిల్, కొకైన్, హెరాయిన్ లను గుర్తించనున్నాయి డ్రగ్ అనలైజర్లు. కీలకమయిన ప్రాంతాల్లో డ్రగ్ పరీక్షలు చేయనున్నారు లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఈ పరీక్షల ద్వారా డ్రగ్ వినియోగదారుల ఆటకట్టించవచ్చని అంటున్నారు.