హైదరాబాద్, ఏప్రిల్ 16,
తెలంగాణలో ప్రస్తుతం ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. గులాబీ బాస్ అనుకున్నట్టే జరుగుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ద్విముఖ పోరులోకి బలవంతంగా బీజేపీని లాగేశారు కేసీఆర్. పదే పదే కమలనాథులను టార్గెట్ చేస్తూ.. కేంద్రాన్ని, మోదీని విమర్శిస్తూ.. వరిపై రాజకీయం చేస్తూ.. రేసులో ఎక్కడో ఉన్న బీజేపీని కాంగ్రెస్ కంటే ముందుకు తీసుకొచ్చారు. ప్రధాన పోరు కారు వర్సెస్ పువ్వు.. అన్నట్టే సీన్ క్రియేట్ చేశారు. హస్తాన్ని కాస్త వెనక్కి తోసేశారు. ఇక వరుస విజయాలను చూసి కమలదళం సైతం పొంగిపోతోంది. తామే తెలంగాణ బాహుబలులమంటూ పిడికిలి బిగిస్తోంది. అప్పుడే ఆ పార్టీలో ముఖ్యమంత్రి సీటు కోసం పోటీ కూడా పెరిగింది. తాజాగా, అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. సీఎం కుర్చీ కోట బీజేపీలో మ్యూజికల్ ఛైర్ ఆట నడుస్తోందని అందరికీ తెలిసి పోయేలా చేసింది. సరిగ్గా ఇదే సమయంలో.. తెలంగాణలో జరిగిన వివిధ సర్వేల ఫలితాలు సైతం.. ప్రస్తుత రాజకీయ వేడికి తగ్గట్టుగానే ఉండటం ఆసక్తికరం.
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి 6 ఎంపీ సీట్లు వస్తాయనేది ఆ సర్వేల సారాంశం. కారు పార్టీకి 8 సీట్లు రావొచ్చట. కాంగ్రెస్ 2తో సరిపెట్టుకుంటుందని చెబుతున్నాయి. లోక్‌సభ స్థానాల పరిధిలో జరిగిన ఈ సర్వేలు.. తాజా రాజకీయ పరిస్థితులకు దగ్గరగానే ఉన్నాయని అనిపిస్తోంది. కాంగ్రెస్ ఖతం కావడమే కేసీఆర్ టార్గెట్. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయినట్టే ఉంది. కాకపోతే, ఎంపీ స్థానాల్లో మోదీని చూసి బీజేపీకి ఓట్లేసే ఛాన్సెస్ ఎక్కువ. కానీ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి సీన్ మారిపోతుందని అంటున్నారు. రు. గట్టిగా చెప్పాలంటే, బీజేపీకి ఇప్పటికిప్పుడు మొత్తం 119 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేరు. ఆ పార్టీ సంస్థాగతంగా ఇంకా బలపడనే లేదు. అర్భన్ పార్టీ ముద్ర ఇంకా తొలిగిపోలేదు. దుబ్బాక, హుజురాబాద్ గెలుపు క్రెడిట్.. బలమైన అభ్యర్థుల ఖాతాలోనే పడుతుంది కానీ ఆ విజయం పార్టీకి ఆపాదించలేం అంటున్నారు. వాపు చూసి బలుపు అనుకుంటున్నారని.. అప్పుడే తానంటే తానంటూ కమలం నేతలు ముఖ్యమంత్రి కుర్చీకి సూటి పెడుతున్నారని అంటున్నారు. ఇటీవల బండి సంజయ్ చేసిన కామెంట్లు.. ఈటల రాజేందర్, రఘునందన్‌రావులను ఉద్దేశించేనని చెబుతున్నారు. ఈటల స్వతంత్రంగా జిల్లాల పర్యటనలు చేస్తుండటంతో ఆయనకు బండి బ్రేకులు వేస్తున్నారు. ఇక, బండి వర్సెస్ కిషన్‌రెడ్డి కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే. ఈ మధ్య రఘునందన్‌రావుతో కూడా బండికి చెడింది. వివేక్ వెంకటస్వామి వేచిచూసే ధోరణిలో ఉన్నారు. కాంగ్రెస్‌లానే కాషాయం పార్టీలోనూ లుకలుకలు మొదలయ్యాయి. ఈ లెక్కన.. ఎన్నికల వరకూ పార్టీలో కుమ్ములాటలు మరింత పెరగొచ్చని అంటున్నారు. బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడం కష్టమే అయినా.. ఇప్పుడున్న 3 సీట్లతో పోల్చితే.. అసెంబ్లీలో డబుల్ డిజిట్‌కు బీజేపీ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. సీఎం కుర్చీ రేసులో.. కమలనాథుల కంటే గులాబీదళానికే విజయావకాశాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్, బీజేపీల మధ్య చీల్చి.. మళ్లీ అధికారంలోకి రావాలనేది కేసీఆర్ వ్యూహం. అయితే, గులాబీ బాస్ ఊహించిన దానికన్నా బీజేపీ బలపడితే మాత్రం టీఆర్‌ఎస్ ఎత్తుగడ బెడిసికొట్టడం ఖాయం. ప్రజలు కాంగ్రెస్ కంటే బీజేపీనే బెటర్ అని భావిస్తే.. కేసీఆర్‌ను వదిలించుకోవాలని అనుకుంటే.. బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి గోల్డెన్ టైమ్ నడుస్తోంది. అంతర్గత సమస్యలను వెంటనే చక్కబెట్టకుని.. ఇదే దూకుడుతో ప్రజల్లోకి వెళితే.. కమలనాథులు ఈసారే అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఆధిపత్య పోరు ఇలానే కొనసాగితే మాత్రం అది బీజేపీకి నష్టమే.. ఆ మేరకు కేసీఆర్‌కు లాభమే.