YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఖమ్మం కారుకు రిపేర్లు

ఖమ్మం కారుకు రిపేర్లు

ఖమ్మం, ఏప్రిల్ 16,
ఖమ్మం కారు పార్టీలో లుకలుకలు ఉన్న సంగతి తెలిసిందే. అగ్రనాయకులు తలోదారిలో ఉండడం వల్ల ఉమ్మడి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటో అధిష్టానానికి నివేదికలు కూడా అందినట్లు సమాచారం. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు.. వారి అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల పీకే టీం సర్వే రిపోర్ట్ అంటూ ఓ నివేదిక హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని చక్కదిద్దే పనిని మంత్రి కేటీఆర్ తన భుజస్కందాల మీద వేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ఆయన పర్యటన ఖమ్మంలో ఉన్న నేపథ్యంలో జిల్లాలోని అందరూ ముఖ్యనేతలు మంత్రి కేటీఆర్ కార్యక్రమాలకు తప్పకుండా హాజరు కావాలని పిలుపు వచ్చినట్లు సమాచారం. అంతేకాదు తీవ్ర అసంతృప్తిగా ఉన్న పొంగులేటి ఇంట్లో లంచ్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ లంచ్ కార్యక్రమానికి మంత్రి అజయ్, ఎంపీ నామా, మాజీ మంత్రి తుమ్మల, ఆయన అనుచరులు, పొంగులేటి అనుచరులు అందరూ తప్పకుండా హాజరు కావాలనే సంకేతాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని అగ్ర నాయకులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కేటీఆర్ ఏర్పాటు చేసిన 'లంచ్' పార్టీ ఎంత వరకు ఫలించేనో అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.2014, 2018 ఎన్నికల్లో రెండు సార్లూ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్కొక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. 2018 ఎన్నికల అనంతరం అధికార పార్టీలోకి ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా రావడంతో ఉమ్మడి జిల్లా గులాబీ మయంగా మారింది. అయినప్పటికీ అప్పటినుంచి పార్టీలో లుకలుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అగ్రనాయకులు, వారి అనుచరులు సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటో ఇప్పటికే అధిష్టానానికి పూర్తి సమాచారం ఉంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ శనివారం ఖమ్మం రానున్న నేపథ్యంలో పొంగులేటి ఇంట్లో లంచ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించి సయోధ్య కుదిర్చే పనిలో యువనేత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా ఎన్నోసార్లు విభేదాలు తలెత్తినప్పుడు కూడా కేటీఆర్ ఇలాంటి పార్టీలే ఏర్పాటు చేసి విభేదాలు పక్కకు పెట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించకపోవడం గమనార్హం. కొంతకాలం పైకి మంచిగానే ఉన్నట్లు కనిపించినా.. మళ్లీ అదేదారిన పోతుతుండడం పార్టీకి పెద్ద తలనొప్పిగానే మారిందని చెప్పాలి.వాస్తవానికి పొంగులేటి సహా ఆయన అనుచరులు తమకు అన్యాయం జరిగిందని పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓ వైపు అధిష్టానం తీరు ఇలా ఉంటే జిల్లాలోని పార్టీ నేతలు సైతం పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఎన్నో సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు సైతం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా ఆయన్ను తీవ్రంగా కలిచివేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పొంగులేటి ఆయన అనుచరులు పార్టీ మారుతున్నట్లు ఇటీవల ప్రచారం కూడా జరిగింది. ఒకొనొక సందర్భంగా ఆయన పార్టీలో లేరన్నట్లే కొందరు టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రవర్తించడం ఆయనకు బాధించింది. ఈ క్రమంలో పొంగులేటి ఎవరు అవునన్నా.. కాదన్నా.. తాను వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో నిలబడబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో పార్టీ ఏమైనా మారుతారా.. లేక టీఆర్ఎస్ పార్టీనుంచేనా అనే చర్చ మొదలైంది. ఒకవేళ పొంగులేటి పార్టీ మారితే ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పని అయిపోతుందని భావించిన అధిష్టానం బుజ్జగించేందుకే ఈ లంచ్ పార్టీని ఆయన ఇంట్లోనే ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందరికంటే ఎక్కువగా ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ శ్రేణులకు తెలియాలనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఇది కేవలం మభ్యపెట్టేందుకేనని పొంగులేటి అనుచరులు చెప్పడం గమనార్హం.ఇటీవల పీకే సర్వే రిప్టోర్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదంటూ ఆ రిపోర్టులో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. పొంగులేటిని వదులుకుంటే పార్టీ పని ఉమ్మడి జిల్లాలో ఖతమైనట్లు కూడా పీకే బృందం సర్వేలో తేలిందని విపరీతమైన పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఇది వాస్తవమా..? కాదా..? పక్కకు పెడితే.. ఉమ్మడి జిల్లాలో పార్టీలో పరిస్థితి అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతర్గత కుమ్ములాటలు, పార్టీనేతల అవినీతి అరాచకాలు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. అగ్రనేతలు తలోదారిన నడవడం ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు కలిగించే అంశాలు కాబట్టి.. ఇప్పటి నుంచే చక్కదిద్దే పనిలో మంత్రి కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే యువనేత పర్యటన సందర్భంగా అందరు నేతలను ఒక్కతాటి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో పుట్టిమునగడం ఖాయమని చెప్పే ప్రయత్నం చేయడంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు.గత ఎన్నికల్లో పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికూల వాతావరణం కనిపించింది. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం సీటు ఒక్కటి మాత్రమే గెలువగా.. 2018 ఎన్నికల్లో ఖమ్మం సీటు మాత్రమే గెలుకుంది. రెండు సార్లు పార్టీ దూకుడు మీదున్నా.. ఆ దూకుడుకు మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం బ్రేకు పడింది.. ఈ సారి టీఆర్ఎస్ పార్టీ జోరు తగ్గి ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.. ఈ నేపథ్యంలో నేతల మధ్య విభేదాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితి మరీ దిగజారింది. అందులోనూ పొంగులేటి ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. సీఎం సొంత సర్వేలో కూడా ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఏంటో తెలిసిపోయిందనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పార్టీ ఇప్పుడు ఎవరినీ వదులుకునే పరిస్థితిలో లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ పొంగులేటి చేజారిపోతే.. కనీసం ఐదారు నియోజకవర్గాలతో పాటు, ఖమ్మం ఎంపీ స్థానం కూడా దక్కవనే అంచనాకు వచ్చిన అధిష్టానం మళ్లీ అందరినీ దగ్గరకు చేసే ప్రయత్నం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.. ఏది ఏమైనా నేతల మధ్య సయోధ్య కుదిరి వచ్చే ఎన్నికల్లో పార్టీ గట్టెక్కుతుందో..? లేక ముఖ్యనాయకులను చేజార్చుకుంటుందో..? అనే చర్చ మళ్లీ మొదలైంది

Related Posts