YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాలుష్య కారక పరిశ్రమలపై ఉక్కుపాదం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

కాలుష్య కారక పరిశ్రమలపై ఉక్కుపాదం      రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్

రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని అంచనా వేయడానికి రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెండు నెలల్లో మోనటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తూ కాలుష్యాన్ని వెదలజల్లే పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టంచేశారు. సచివాలయంలోని తన కార్యాలయంలో అటవీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపుదలలో అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ దినేష్ కుమార్ తెలిపారు. కేవలం మొక్కలు నాటడంతోనే సరిపెట్టకుండా వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొక్కల పెంపకంలో ప్రతినెలా శాఖల వారీగా సమీక్షలు నిర్వహించేలా చూడాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనంతరాములను ఆదేశించారు. మొక్కలు నాటిన నుంచి వాటి పెరుగుదలపై దశలవారీగా వీడియోలు తీయాలని, వాటిని వచ్చే సమావేశాల్లో ప్రదర్శించాలని అన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడేదిలేదని హెచ్చరించారు. నగర వనాలు, పవిత్ర వనాలతో నర్సరీల అభివృద్ధితో పాటు కొండలపై పచ్చదనం పెంపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కల పెంపకంపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఎకో టూరిజం అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు సాగాలన్నారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా ఎకో టూరిజం ప్రాజెక్టుల్లో వసతులు కల్పించాలన్నారు. అటవీశాఖలో ఖాళీల భర్తీకి సీఎస్ దినేష్ కుమార్ పచ్చజెండా ఊపారు. అంతకుముందు అటవీశాఖలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ఆ శాఖ చీఫ్ కన్జర్వేటర్ పి.మల్లిఖార్జునరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.కాలుష్య కారక పరిశ్రమలపై కఠినంగా వ్యహరించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను రాష్ట్ర ప్రభుత్వ దినేష్ కుమార్ ఆదేశించారు. కాలుష్య శాతం లెక్కింపులో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని అంచనా వేయడానికి రెండు నెలల్లో మోనటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, రియల్ టైమ్ గవర్నెన్స్ సమన్వయం చేసుకుంటూ కాలుష్య కారక పరిశ్రమలపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఇంతవరకూ ఎన్ని పరిశ్రమలపై కేసులు నమోదు చేశారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను సీఎస్ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పరిశ్రమల్లో మొక్కులు పెంచేలా తరుచుగా ఆయా కంపెనీలను సందర్శించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను సీఎస్ ఆదేశించారు.గిరిజనుల ఆదాయం పెంపుదలకు వారికి నైపుణ్య శిక్షణలు ఇవ్వాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులను సీఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. తేనె సేకరణలోనూ, కాఫీ, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లలోనూ పనిచేసే గిరిజనులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆదాయం పెంచేందుకు వీలవుతుందన్నారు. ఆదాయం ఇచ్చే పండ్ల చెట్లను పెంపకం బాధ్యతలను గిరిజనులకు అప్పగించాలన్నారు. ఎకో టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిలో అటవీశాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.అనంతరాములు, చీఫ్ కన్జర్వేటర్ పి.మల్లిఖార్జునరావు, ఏపీ ఫారెస్టు డవలప్ మెంట్ కార్పొరేషన్ ఎం.డి. ప్రతీప్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎస్.కె.కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. 

Related Posts