అనంతపురం
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ స్వాగత కార్యక్రమంలో ఒక చిన్నారి ప్రాణాన్ని బలితీసుకోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని చాటుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు.. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన 8నెలల చిన్నారిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతున్న సమయంలో మంత్రి ఊరేగింపు కోసం పోలీసులు రహదారిలో రాకపోకలు నిలిపివేయడంతో సకాలంలో వైద్యం అందక పసికందు మరణించడం అత్యంత విషాదమని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. చిన్నారి మృతి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తగిన న్యాయం చేయడానికి మంత్రి ఉషశ్రీచరణ్ ప్రయత్నించకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించడంతో పాటు అన్ని విధాలా వారికి న్యాయం చేయాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.