విశాఖపట్టణం, ఏప్రిల్ 18,
విశాఖ వాసులకు మరో శుభవార్త. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విశాఖసిగలో మెట్రో ను ఇమడ్చేందుకు శాయాశక్తులా ప్రయాత్నాలు చేస్తున్నారు. కొత్త మార్గాలతో కలిపి మొత్తం 77 కిలోమీటర్లకు విశాఖ మెట్రో రైలు డీపీఆర్ సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావు వివరాలు వెల్లడించారు. ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించి అనుమతి తీసుకోవాలని వివరించారు. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే ఈ ఏడాదే శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి, భోగాపురం, భీమిలి, పెందుర్తి ప్రాంతాలను లెక్కలోకి తీసుకోగా.. 40 లక్షలకు పైగా జనాభా ఉండడంతో లైట్ మెట్రోను పట్టాలెక్కించనున్నట్లు చెప్పారు. మొదటగా స్టీలుప్లాంటు- కొమ్మాది రూట్ నిర్మించి, ఆ వెంటనే మెట్రో సర్వీసును ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆ తరువాత మిగిలిన రూట్లను దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. మొదటి దశ పూర్తికి అయిదేళ్లు పడుతుందని చెప్పారు.మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేసినట్టు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ యూజేఎం రావు వివరించారు. హై పవర్ కమిటీ ఆధ్వర్యంలో రూ.14,309 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు అంచనాలు రూపొందించినట్టు వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టు నేపథ్యంలో స్థానికుల స్థలాలకు, భవనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. విశాఖలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు రాకతో ప్రయాణికులు, చిరు ఉద్యోగుల కష్టాలు తీరుతాయని విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.