YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

నోట్ల రద్దు తర్వాత ఆర్థిక రంగానికి భారీ లాభం..

నోట్ల రద్దు తర్వాత ఆర్థిక రంగానికి భారీ లాభం..

- 18 నెలల్లో 28 లక్షల కోట్లు..

- థాయ్‌లాండ్ జీడీపీ సమాన మొత్తం బ్యాంకుల్లో జమ..

- ఆన్‌లైన్ లావాదేవీలూ భారీగా పెరిగాయి.. 

- దావోస్ ఆర్థిక సదస్సులో ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చర్

ఆర్థిక మదుపులో భారత్ దూసుకెళుతోందని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ చెప్పారు. 18 నెలల కాలంలోనే దాదాపు రూ.28 లక్షల కోట్ల డిపాజిట్లు బ్యాంకుల్లో దాఖలయ్యాయని, ఆ మొత్తం థాయ్‌లాండ్ వంటి దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో సమానమని ఆమె వ్యాఖ్యానించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పాత నోట్లు రద్దు చేసిన నవంబరు 2016 నుంచి సేవింగ్స్ బాగా పెరిగాయని ఆమె వివరించారు. ఆర్థిక వ్యవస్థను సంఘటిత పరచడం, బ్యాంకు లావాదేవీల డిజిటైజేషన్ వంటి వాటికి నోట్ల రద్దు తర్వాత భారీగా డిమాండ్ పెరిగిందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం.. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠానికి పలు వ్యవస్థీకృత సంస్కరణలను అమలు చేసిందన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ సంఘటితమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేలా మరిన్ని సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆమె అన్నారు.

సేవింగ్స్ విషయంలో నోట్ల రద్దు మంచి ఫలితాన్నే ఇచ్చిందని, వ్యవస్థాగత మార్పులను తీసుకొచ్చిందని ప్రశంసించారు. బ్యాంకులు, బీమా రంగం, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక రంగ సంస్థలు నోట్ల రద్దు వల్ల బాగా లాభపడ్డాయని అన్నారు.  మరోవైపు నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో ఆన్‌లైన్ లావాదేవీలు బాగా పెరిగాయని, నోట్లు రద్దు అయిన ఒక్క 2016 నవంబరులోనే 10 లక్షల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయని, 2017 డిసెంబరు నాటికి ఆ లావాదేవీల సంఖ్య 14.5 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇక, మొబైల్ బ్యాంకింగ్ విషయానికొస్తే అక్టోబరు 2017 నాటికి డబుల్ అయ్యాయని, 15 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయని ఆమె చెప్పారు. అంతేగాకుండా ఏటీఎం కార్డుల వాడకం కూడా రెట్టింపైందని ఆమె వివరించారు. 

Related Posts