తిరుమల, ఏప్రిల్ 18,
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ శుభవార్త అందించారు. మే 1 నుంచి శ్రీవారి మెట్టు మార్గాన్ని నడక భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమైంది. దీంతో మెట్లు మరమ్మతులకు గురికావడంతో ఐదు నెలలుగా నడక మార్గం మూతపడింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మరమ్మతుల పనులు పూర్తి చేసినట్లు టీటీడీ మెంబర్ పోకల అశోక్ కుమార్ వెల్లడించారు. దీంతో అలిపిరి మార్గంతో పాటు నడక ద్వారా తిరుమలకు చేరుకోవాలనే భక్తులు ఇకపై శ్రీవారి మెట్టు మార్గంలోనూ వెళ్లవచ్చు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల కొండ భక్తులతో పోటెత్తుతోంది. భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్ల జారీని పూర్తిగా నిలిపివేశామని.. కొండపై కంపార్ట్‌మెంట్లలో భక్తులను ఉంచి సర్వదర్శనానికి అనుమతిస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్తున్నారు. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, వసతి, పాలు, తాగునీరు అందిస్తున్నామని వారు తెలిపారు.