ఒంగోలు, ఏప్రిల్ 18,
ఏపీలోని విజయవాడ నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు కొత్తగా జాతీయ రహదారి ఏర్పడనుంది. బెంగళూరు, కడప, విజయవాడను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హైవేపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అధికారులు రహదారిని నిర్మించనున్నారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించనున్నారు. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 90 మీటర్ల వెడల్పున అధికారులు భూమిని సేకరించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 వేల ఎకరాల భూసేకరణకు త్వరలోనే 3ఏ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. భూసేకరణలో భాగంగా ప్రభుత్వ, అటవీ, పట్టా భూముల వారీగా వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. డీపీఆర్ ప్రకారం ఏయే రెవెన్యూ గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుందనే వివరాలతో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.మరోవైపు సామర్లకోట నుంచి కాకినాడ పోర్టు వరకు నాలుగు లైన్‌ల రోడ్లను అధికారులు నిర్మించనున్నారు. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేసేలా హైవే అథారిటీ కార్యాచరణ రూపొందించింది. సామర్లకోట నుంచి అచ్చంపేట వరకు మొదటి ప్యాకేజీ కింద రూ.400 కోట్లు ఖర్చు చేయనుంది. విస్తరణలో సామర్లకోటలో వందలాది ఇళ్లు కూల్చాల్చి వస్తుండంతో అలైన్‌మెంట్‌లో మార్పు చేసింది. అచ్చంపేటలో ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.120కోట్లతో భూసేకరణ చేపట్టనుంది. ప్యాకేజీ-2 కింద అచ్చంపేట నుంచి పోర్టు వరకు ఫోర్ వే లైన్ రోడ్లు నిర్మించనుంది. రూ.140 కోట్లతో టెండర్లు ఖరారు కాగా త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.