YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

3వ కూటమి అడుగులు....

3వ కూటమి అడుగులు....

ముంబై, ఏప్రిల్ 18,
దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో ముంబైలో భారతీయ జనతా పార్టీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని శివసేన ఎంపీ, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆదివారం వెల్లడించారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ అయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వరం పెంచారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్ని బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలలో.. దేశంలో నెలకొన్న విషయాలపై సవివరంగా చర్చించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారని రౌత్ అన్నారు.భారతీయ జనతా పార్టీని రాజకీయంగా అడ్డుకోవడానికి ఏకం కావాలన్న విపక్షాల ప్రయత్నాలకు ముందడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా భాజపాయేతర ముఖ్యమంత్రులు త్వరలో భేటీ కానున్నారు. ఇందుకు ముంబయి వేదిక కానుంది. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కలిసి చర్చించారని, ఇందులో భాగంగా ముంబయిలో ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంజయ్ రౌత్‌ వివరించారు.ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెరుగుుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతపరమైన అల్లర్లు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు రౌత్‌ వెల్లడించారు. అలాగే, దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి, హనుమాన్‌ జయంతి సందర్భంగా జరిగిన కొన్ని ఘటనలు రాజకీయ ప్రేరేపితమైనవిగా పేర్కొన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లోనే ఒక వర్గం ఓటర్లను సమీకరించేందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కాగా, దేశంలో ఇటీవల చోటుచేసుకున్న విద్వేష ప్రసంగాలు, మతపర హింసపై కాంగ్రెస్‌ సహా 13 విపక్ష పార్టీల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో బిజెపియేతర సీఎంలు భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.రాజ్ థాకరేకు సంజయ్ రౌత్ చురకలు మరోవైపు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన  అధ్యక్షుడు రాజ్ థాకరేపై హేళన చేస్తూ, రౌత్ అతన్ని కొత్త హిందూ ఒవైసీగా పేర్కొన్నారు. అతను మే 3 వరకు మహారాష్ట్రలోని మసీదుల వెలుపల లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. “మహారాష్ట్రలో కూడా, హనుమాన్ జయంతి వేడుకల సమయంలో సామరస్యానికి భంగం కలిగించడానికి, అశాంతిని సృష్టించడానికి ఒక కొత్త హిందూ ఒవైసీ ఒక మార్గాన్ని కనుగొన్నారు, కానీ రాష్ట్ర ప్రజలు దీనిని గ్రహించారు. ఇక్కడి పోలీసులు వారి ఫ్లాన్‌ను విఫలం చేయగలిగారు” అని రౌత్ అన్నారు. మసీదులలో లౌడ్ స్పీకర్ల సమస్యను మహా వికాస్ అఘాడి ప్రభుత్వంతో కలిసి ఉండేదని, అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించి, బిజెపి కోరుకున్నట్లుగా రాష్ట్రపతి పాలన విధించడానికి మార్గం సుగమం చేయడమే దీని ఉద్దేశమని రౌత్ దుయ్యబట్టారు.

Related Posts