హైదరాబాద్, ఏప్రిల్ 18,
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు...రాష్ట్ర రాజకీయాలలో తన పని పూర్తయ్యిందని భావిస్తున్నారా? జాతీయ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి సారించారా? అన్న విషయంపై చాల కాలంగా రాజకీయాలలోనూ...ప్రజా బాహుల్యంలోనూ ఆసక్తికర చర్చలే జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఆయన జాతీయ రాజకీయ ప్రవేశం అన్నది ఒక అడుగు ముందుకు...రెండడుగులు వెనక్కు అన్న చందంగానే సాగింది. అయితే ఇటీవలి పరిణామాలను గమనిస్తున్న వారికి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆయన జాతీయ రాజకీయాలపైనే పూర్తి దృష్టి కేంద్రీకృతం చేస్తారని అనిపించక మానదు. ఇటీవలే హస్తినలో పది రోజులు మకాం వేసిన ఆయన ఇప్పుడు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ సారి పర్యటనలో ఆయన రైతులతో భేటీలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందిస్తారు. కేంద్రంలో బీజేపీతో ఆయన ఇటీవలి కాలంలో ఘర్షణ వైఖరి అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్న ఆయనకు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒకింత తలనొప్పిగానే మారాయి. ఉద్యోగాల ప్రకటన, వడ్ల పోరాటం ఇలా ఆయన మాటల మంత్రాలకు గతంలోల ప్రజల హర్షామోదాల చింతకాయలు రాలడం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను కలుపుకుని ఫ్రంట్ కట్టాలన్న ఆయన వ్యూహాలూ పారడం లేదు. రాష్ట్రంలో వ్యతిరేకతను అధిగమించాలంటే కేంద్రంపై యుద్ధం ప్రకటించడ ద్వార జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల మద్దతు కూడగట్టడమే మార్గమన్న భావనతో ఆయన అందివస్తుందనుకున్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ యేతర పార్టీల నేతలతో జరిపిన వరుస భేటీలు ఫలితమివ్వకపోవడంతో ఆయన రైతు సమస్యలను ఆయధంగా కేంద్రంపై యుద్ధంప్రకటించారు. అయితే వడ్లు కొనుగోల వ్యవహారంలో పాచిక పారకపోవడంతో ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ ధర్నాలో రైతు నేత తికాయిత్ కు ప్రత్యేక ఆహ్వానం. ఇప్పుడు రైతు కుటుంబాల పరామర్శ. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో రైతుల మద్దతుతో కేంద్రాన్ని ఢీ కొట్టాలన్నది ఆయన వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు.