న్యూఢిల్లీ, ఏప్రిల్ 18,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి మకాం మారుస్తున్నారా? కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఆయన ఇక అక్కడినుంచే రాజకీయ చక్రం తిప్పేందుకు సిద్దమయ్యారా, హైదరాబాద్’కు గుడ్ బై’ చెప్పేందుకు తయారయ్యారా? అంటే రాజకీయ విశ్లేషకులే కాదు, తెరాస సన్నిహిత వర్గాలు కూడా అవుననే అంటున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీ వెళుతున్నారు. వస్తున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిరావడం,ఓకే కానీ, ఎందుకు, ఏ కార్యం మీద వెళ్ళారు, ఎన్నిరోజులు ఉంటారు వంటి వివరాలతో పాటుగా, ఢిల్లీ లో ఉన్న సమయంలో ఆయన ఏమి చేశారు, ఎవరిని కలిశారు వంటి వివరాలు అధికారికంగా ప్రజలకు తెలియచేస్తే, సమస్య ఉండదు. కానీ, ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రలు, రాహుల్ గాంధీ విదేశీ యాత్రల్లా గోప్యంగా ఉంచడంతో, ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా అనేక ఊహాగానాలు, వ్యూహాగానాలు ప్రచారమవుతున్నాయి. ఏవేవో కథలు, కహానీలు వినవస్తున్నాయి. ఏప్రిల్ 3న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఏకంగా ఎనిమిది రోజుల పాటు అక్కడే ఉన్నారు. అంతకు ఐదారు రోజుల ముందు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతున్నారని, ప్రత్యెక విమానం సిద్దమై పోయిందంటూ తెల్లారకముందే బ్రేకింగ్ వార్తలు వచ్చాయి. అయితే ఆ రోజు ఆయన ఢిల్లీ వెళ్ళలేదు. కానీ, ఏప్రిల్ 3 న, హఠాత్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్’ ఢిల్లీ వెళ్ళారు. కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మరో ఇద్దరు ముగ్గురు సన్నిహితులు కూడా ఆయన వెంట ఢిల్లీ వెళ్లారు. ప్రధానిని కలుస్తారని, కలవరని, అప్పాయింట్మెంట్ ఉందని, లేదని, పంటి చికిత్సకే ఢిల్లీ, అనీ, ఇలా అనేక అనధికార ..ట..ట..వార్తలే కానీ, అధికారికంగా ఇలాంటి సమాచారం లేదు. అయినా ముఖ్యమంత్రి ఏడెనిమిది రోజులు అక్కడే ఉన్నారు. ఆ ఏడెనిమిది రోజుల్లో ఆయన ఏమి చేశారో ఎవరికీ తెలియదు కానీ, చివరకు ఏప్రిల్ 11న, యాసంగి ధాన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనాలనే డిమాండ్‌తో తెరాస పార్టీ ఢిల్లీ తెలంగాణ భవన్’ లో నిర్వహించిన దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకుడు,కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పోరాటం చేసిన భారాతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, మళ్ళీ ఢిల్లీ వస్తానని, బీజేపే వ్యతిరేక శక్తులు అన్నింటినీ, ఏకం చేస్తానని మరో మారు యుద్దనాదం చేసి హైదరాబాద్ విమానం ఎక్కేశారు.ఇక ఇప్పుడు మళ్ళీ రేపో మాపో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని, మళ్ళీ మరో వారం పదిరోజులు, అవసరం అయితే ఇంకా ఎక్కువ రోజులే అక్కడే ఉంటారని అంటున్నారు. అంతే కాకుండా, ముఖ్యమంత్రి ఫ్రెష్ ఢిల్లీ యాత్ర, ప్యూర్లీ పొలిటికల్ యాత్ర అని కూడా తెలుస్తోంది. ఈ పర్యటనలో ముఖ్యమత్రి ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖీరీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి(ఆ తరువాత రద్దు చేసిన) వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లఖీంపూర్ ఖీరీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు వాహనాన్ని ఎక్కించడం, ఈ ఘటనలో నలుగురు రైతులు,ఒక జర్నలిస్టు సహా మొత్తం ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాగా, అప్పట్లో, ఈ ఘటన దేశంలో పెను ప్రకంపనలు సృష్టించింది.ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా వినియోగించుకున్నాయి. అయినా, ఫలితం లేక పోయింది. రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడమే కాదు, లఖీంపూర్ ఖీరీలోనూ బీజేలే అభ్యర్థే భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరో వంక మూడు వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరిట సాగిన రాజకీయ ఆందోళనకు, చుక్క పెట్టేందుకు అనివార్య పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసినా దేశంలో 90 శాతానికి పైగా రైతులు అవే చట్టాలకు మద్దతు తెలుపుతున్నారని తాజా, సర్వేలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కేసీఆర్ అక్కడికి వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇదంతా కూడా, జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్’కు స్థానం కలిపించేందుకు ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిశోర్ రచించిన వ్యూహంలో భాగంగా సాగుతోందని ఒక ప్రచారం జరుగుతోంది. అందుకే, పీకే సలహా మేరకు ముఖ్యమంత్రి, బీహరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ కుమార్ ఝాను పీఆర్ఓగా నియమించుకున్నారు. మరో వంక ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న నేపధ్యంలో, కేటీఆర్’ ఎన్నికలకు ముందుగానే ముఖ్యమంత్రిని చేసే ఆలోచన కూడా ఉందని, అందుకే ముఖ్యమంత్రి ఢిల్లీకి మకాం మారుస్తున్నారని అంటున్నారు. అందుకే, ఇక ముఖ్యమంత్రి ఢిల్లీకి మకాం మార్చినట్లేనని అంటున్నారు.