సీతానగరం
ప్రభుత్వం నుంచి ప్రజలకు వారధిగా పనిచేస్తామంటూ ముందుకు వచ్చిన గ్రామ సేవకులు పెడదోవపడుతున్నారు. మేలు మాట దేవుడెరుగు..విలేజ్ వాలంటీర్ వలన ప్రజలకు జరుగుతున్న మంచి ఏమి లేదని ఏపీ ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ పధకాలు అందజేతలో భాగంగా ఇంటికి వచ్చిన ఓ విలేజ్ వాలంటీర్..ఆ ఇంటిలోని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న బూసి సతీష్(23) అనే యువకుడు బొబ్బిల్లంక గ్రామానికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రభుత్వ పధకాలు చేరవేత పేరుతో తరచూ బాలిక ఇంటికి వెళ్లివచ్చే సతీష్..ఇటీవల ఇంటిలో బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో..ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు.ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ సతీష్ బాలికను హెచ్చరించాడు. అయితే అప్పటి నుంచి బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు..అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. గ్రామ వాలంటీర్ సతీష్ అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు సీతానగరం పోలీసులకు సమాచారం ఇవ్వగా..రంగంలోకి దిగిన పోలీసులు గ్రామ వాలంటీర్ సతీష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు సతీష్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ శుభశేఖర్ తెలిపారు.