నాసిక్ ఏప్రిల్ 18
హనుమాన్ ఛాలీసా లేదా భజనలు లౌడ్‌స్పీకర్లలో ప్లే చేయాలంటే అనుమతి తీసుకోవాల్సిందే అని నాసిక్ సీపీ దీపక్ పాండే తెలిపారు. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లను తీసివేయాలని రాజ్ థాకరే ఇచ్చిన పిలుపు నేపథ్యంలో నాసిక్ సీపీ తాజాగా ఈ విషయాన్ని తెలిపారు. మసీదుల్లో అజాన్ ఇచ్చే 15 నిమిషాల ముందు కానీ, అజాన్ ముగిసిన 15 నిమిషాల లోపు కానీ ఛాలీసా ప్లే చేయరాదు అని ఆయన అన్నారు. మసీదుకు వంద మీటర్ల దూరం వరకు కూడా హనుమాన్ ఛాలీసాను మైకుల్లో ప్లే చేయడానికి అనుమతి ఇవ్వడం లేదన్నారు. శాంతి భద్రతల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దీపక్ పాండే చెప్పారు. అయితే లౌడ్‌స్పీకర్ల కోసం అన్ని మతపరమైన ప్రాంతాలు మే నెల మూడవ తేదీ లోపు పర్మిషన్ తీసుకోవాలని ఆయన అన్నారు. మే 3వ తేదీ తర్వాత ఎవరైనా రూల్స్‌ను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ దీపక్ పాండే తెలిపారు.
కాగా మే 3వ తేదీ తర్వాత మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా చీఫ్ రాజ్ థాకరే పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నియంత్రణ ప్రకటించింది. మతపరమైన ప్రదేశాల్లో పర్మిషన్ లేకుండా లౌడ్‌స్పీకర్లను అనుమతించమని ఆ రాష్ట్ర హోంశాఖ ఇవాళ స్పష్టం చేసింది. హోంశాఖ మంత్రి దిలీప్ వాసే పాటిల్.. ఆ రాష్ట్ర డీజీపీతో ఈ విషయమైన మీటింగ్ నిర్వహించనున్నారు.రాజ్ థాకరే వార్నింగ్‌తో లౌడ్‌స్పీకర్ల వివాదం మరింత ముదిరింది. చట్టం, దేశం కన్నా మతం గొప్పది కాదని ఈ దేశ ముస్లింలు అర్థం చేసుకోవాలని ఆదివారం రాజ్ థాకరే తన వార్నింగ్‌లో తెలిపారు. మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తీసివేయాలని కోరారు. మహారాష్ట్రలో అల్లర్లు తమకు ఇష్టం లేదని, ప్రార్థనలు చేసుకోవడాన్ని ఎవరూ అడ్డుకోవడం లేదని, మసీదుల్లో వాడుతున్న లౌడ్‌స్పీకర్లను తొలగించాలని, ఒకవేళ మీరు తీసివేయకుంటే ఇక మేం కూడా లోడ్‌స్పీకర్లను వాడాల్సి వస్తుందని, మే 3వ తేదీ తర్వాత ముస్లింలు లౌడ్‌స్పీకర్లు తీయకుంటే, అప్పుడు మేం ఏం చేయాలో చెబుతామని రాజ్ థాకరే వార్నింగ్ ఇచ్చారు. మే 3వ తేదీ తర్వాత లౌడ్‌స్పీకర్లను తీయని మసీదుల వద్ద హనుమాన్ ఛాలీసా ప్లే చేయాలని రాజ్ థాకరే హిందువులను కోరాడు.