అమరావతి ఏప్రిల్ 18
ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు చట్ట సభల్లో హుందాగా వ్యవహరించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. చట్ట సభలోకి వచ్చే నాయకులు బుద్ధి బలం ఉపయోగించాలని భుజ బలం కాదని సూచించారు. ఇవాళ మచిలీపట్నంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పిన్నమనేని కోటేశ్వరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నేడు రాజకీయాల్లో స్థాయి తగ్గిపోతుందని, మున్సిపల్ నుంచి పార్లమెంట్ స్థాయి వరకు జరుగుతున్న చర్చలు భాషా పరంగాని, వ్యవహారశైలీగాని సక్రమంగా జరగడం లేదని ప్రజల్లో ఒక ఆవేదన ఉందని అన్నారు.పరిధిలు దాటి మాట్లాడే పరిస్థితి రావడం విచారకరమని పేర్కొన్నారు. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం మంచిది కాదని అన్నారు. ఈ మూడింట వల్ల దేశం బలహీనమవుతుందన్నారు. నాయకులను ఎన్నుకునేటప్పుడు క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాంటాక్ట్‌ను చూసి గెలిపించాలని కాని నేడు క్యాష్, కులం, క్రిమినాలిటీని చూడడం బాధకరమని అన్నారు. కులం కన్న గుణం మిన్న అని అన్నారు. రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు బాధ్యతయుతంగా ఉండాలని సూచించారు.బాధ్యతలు లభించినప్పుడు శైలీ, పద్దతిని మార్చుకోవాలని అన్నారు. రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని ప్రజలు కోరుతున్నారని, ఈ విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ఎన్నికల్లో ఓటేసే ముందు ప్రజాప్రతినిధుల వ్యవహర శైలీ ఎలా ఉందో గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఎన్నికల్లో ధనం, కులం, మతాన్ని చూసి ఓట్లేయడం ప్రమాదకరమని , వీటికి అతీతంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. పిన్నమనేని కోటేశ్వరరావు పార్టీలకు అతీతంగా అభివృద్ధే ప్రధాన అజెండాగా పనిచేశారని ప్రశంసించారు. ఈనాటి తరం రాజకీయనాయకులందరికీ ఆయన చేపట్టిన పనులు ఆదర్శనీయమని అన్నారు.