తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని గట్టిగా కసరత్తులు చేస్తోంది. ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉందని తెలియడంతో బలమైన మోడీతో కూడా బంధాన్ని చంద్రబాబు తెగదెంపులు చేసుకున్నారు. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చి మరో రికార్డు తిరగరాయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం దీక్షలకు దిగారు. సైకిల్ ర్యాలీలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న మహానాడుల్లో కూడా మోడీని టార్గెట్ చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న కొత్త పంథా ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి నెడుతోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేస్తున్న సర్వేలపై మండిపడుతున్నారు. ఇటీవల చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్రేడింగ్ ను కార్యకర్తల ఫీడ్ బ్యాక్ ద్వారా ఇచ్చానని చంద్రబాబు స్వయంగా పార్టీ నేతల సమావేశంలోనే చెప్పడం విశేషం. ఇక కార్యకర్తల మనోభిప్రాయాల మేరకే ఎమ్మెల్యేల గ్రేడ్లు ఉంటాయని, ఫీడ్ బ్యాక్ సక్రమంగా లేకుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రావడం కూడా కష్టమేనని చంద్రబాబు నిర్మొహమాటంగా చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబుకు ఫీడ్ బ్యాక్ ద్వారా అర్థమయింది. తనపై ప్రజలకు ఎంత విశ్వాసమున్న లోకల్ లీడర్లపై అసంతృప్తి ఉంటే అధికారంలోకి రాలేమని భావించిన చంద్రబాబు అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో చంద్రబాబు ఎమ్మెల్యేలను ఒక దారిలో పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల మీద స్థానికంగా ఇసుక మాఫియాకు అండగా ఉంటున్నారని, కాంట్రాక్టర్లతో లాలూచీ పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే వీటన్నింటి నుంచి బయటపడాలని, లేకుంటే వచ్చే ఎన్నికలలో టిక్కెట్ రావడమూ కష్టమేనని చంద్రబాబు చెప్పేశారు.ఎమ్మెల్యేలకు మింగుడుపడని అంశం ఏంటంటే…కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనేక నెలలుగా సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తమ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. కాని నిధుల లేమితో ఆర్థిక శాఖ కేటాయింపులు చేయడం లేదు. ఇందువల్ల కార్యకర్తలకు కూడా మేళ్లు చేకూర్చలేకపోతున్నామన్నది ఎమ్మెల్యేల అభిప్రాయంగా ఉంది. తాము కార్యకర్తలు అడిగిన పని చేయలేకపోతే తమకు వ్యతిరేకంగా చెబుతారు కదా? అని కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. తాము నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆర్ధికేతర సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని, చంద్రబాబు కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోకుండా ప్రజల నుంచి తీసుకోవాలని మరికొందరు కోరుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఫీడ్ బ్యాక్ వ్యవహారం ఎమ్మెల్యేల్లో ఫీవర్ తెప్పించిందనే చెప్పొచ్చు