విజయనగరం, ఏప్రిల్ 19,
పదవి పోయింది. పరపతీ పోయింది. పరువూ పోయింది. పనిలేక ఖాళీగా ఉంది. ఏం చేస్తాం.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అయితాయా ఏం.. అంటూ దిగాలుగా ఉంటోంది. ఊరికే ఉంటే ఏమీ తోచదుగా. ఖాళీగా ఉంటే అందరికీ లోకువేగా. అసలే, కరెంట్ కోతలు.. విసనకర్రతో ఊపుకొని ఊపుకొని.. విసుగొచ్చినట్టుంది. కాసేపు అలా పొలంబాట పట్టింది. గతంలో తాను ఏపీకి ఉప ముఖ్యమంత్రిని అనే విషయం పక్కన పెట్టేసింది. ఆడుతూ పాడుతూ పని చేస్తూ.. తోటలో కూరగాయలు కోస్తూ.. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించారు మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి. ఆ ఫోటోలను స్వయంగా ఆమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పిక్స్ వైరల్ అయ్యాయి. కొందరు మంత్రి చేసిన పనిని మెచ్చుకుంటుంటే.. సెటైర్లు, విమర్శలూ ఓ రేంజ్‌లో వస్తున్నాయి. పుష్ప శ్రీవాణి ఫాంహౌజ్‌లో గంపలో టమోటాలు ఏరుకుంటూ ఉందో ఫోటో. మరో ఫోటోలో మొక్కలకు నీళ్లు పడుతూ కనిపించారు. మంత్రి పదవి పోయిందనే బాధను.. ఇలా కూరగాయ మొక్కల పెంపకంతో మర్చిపోతున్నట్టున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లాలోని కురుపం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పుష్ప శ్రీవాణి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెకు కేబినెట్‌లోకి తీసుకొని.. ఏకంగా డిప్యూటీ సీఎంను చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ బాధ్యతలు అప్పగించారు. పని తీరు బాగాలేదో.. శ్రీవాణిని మంత్రిని చేసినా ఉపయోగం లేదనుకున్నారో.. కారణం ఏదైనా కేబినెట్ నుంచి తీసేశారు జగనన్న. పదవి పోయిన బాధలో అమరావతి నుంచి సొంతజిల్లాకు వచ్చేశారు. పదవి పోయాక ఇక పనేముంటుంది.. ఫుల్ ఖాళీ. కరెంట్ కోతలు, చార్జీలు పెంపుల బాదుడే బాదుడుతో తనకేం సంబంధం లేదన్నట్టు.. ఎంచక్కా కూరగాయలు మొక్కలతో ఇలా సేద తీరుతున్నారు పుష్ప శ్రీవాణి.