అమలాపురం, ఏప్రిల్ 19,
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయ రచ్చకు తెరలేపుతున్నాయి. నిన్న మొన్నటి మంత్రి పదవి రాని అసంతృప్త ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం ఎలాగో బుజ్జగించింది. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుతో మరోసారి అసంతృప్తులు రచ్చకెక్కేలా కనిపిస్తున్నాయి. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న తమ డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోలేదన్న సాకు చూపి పదుల సంఖ్యలో పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. రాజీనామాల్లో భాగంగా కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన నేతలు ఎంపీటీసీ నెల్లి దుర్గాప్రసాద్ సహా 38 మంది పార్టీకి రాజీనామాలు సమర్పించారు. ఈ సందర్భంగా నెల్లి దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని జిల్లా నుంచి పెద్దఎత్తున ప్రభుత్వానికి వినతులు వెళ్లాయని, తమ ప్రతిపాదనకు పార్టీ గౌరవం ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దళితపేటల్లోని పార్టీ శ్రేణులతో కూడా రాజీనామాలు చేయిస్తామన్నారు. ఈ రాజీనామాలపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.