YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల..వంద వివాదాలు

తిరుమల..వంద వివాదాలు

తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు.. ముందు నుంచి అధికారుల పనితీరుపై అసంతృప్తిగానే ఉంటున్నారు. ఎలా కావాలంటే అలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిబంధనలు మార్చుకోవడం, కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పట్ల పలు సార్లు ఆయన ఆరోపణలు చేశారు. తిరుమల ఆలయంలో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా కొన్ని కైంకర్యాలు చేయడం, ఆలయంలో మార్పులు చేయడాన్ని కూడా ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇటీవల గర్భగుడి పక్కభాగం నుంచి వెలుపలకు అల్యూమినియం రెయిలింగ్‌లతో  ఆకాశ మార్గాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా వ్యతిరేకించారు. అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ ప్రయోగం చేశారు. ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని రమణదీక్షితులు చాలాసార్లు చెప్పారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రిని కలుసుకుని, దాని వలన జరిగే నష్టాలను వివరించారు. ముఖ్యమంత్రి ఆకాశమార్గం పనులను ఆపేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. తిరుమలలో ప్రధాన అర్చకులకు విలువలు తగ్గిపోతున్నాయని రమణ దీక్షితులు భావిస్తున్నారు. ముఖ్యంగా అర్చక వారసత్వాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు చేయడం ఆయన మనసుకు కష్టం కలిగించినట్లు తెలుస్తోంది. ఇది కూడా ఆగమ శాస్త్రానికి విరుద్ధమని అంటున్నారు. స్వామివారిని తాకే అధికారం శాస్త్రీయంగా ఆగమ అర్చకులకు మాత్రమే ఉందంటున్నారు. సమయపాలన లేకుండా సినిమావాళ్లు, రాజకీయ నాయకులకు ప్రాముఖ్యం కల్పిస్తూ ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. తోమాలసేవ లాంటి ముఖ్య సేవలను కూడా తూతూమంత్రంగా ముగిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. 1996 వరకు వంశపారపర్యంగా ఆలయ ఆభరణాలను సంరక్షిస్తూ ఉన్నామని, ఇప్పుడు ఆభరణ వివరాలను కూడా తమకు తెలియజేయడం లేదని వాపోయారు. ఇవన్నీ చూస్తుంటే ఆభరణాలన్నీ ఎంత భద్రంగా ఉన్నాయనే అనుమానాలకు తావిస్తోందని అన్నారు. కృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణలు ఉన్నాయా లేవా అనే అనుమానాలు కలుగుతున్నా యని అన్నారు. వేయకాళ్ల మండపం కూల్చివేయడాన్ని తాను అప్పట్లో వ్యతిరేకించానని అన్నారు. స్వామి వారి రథ మండపం కోసం కూడా పోరాడానని, వాటిని కూడా కాపాడుకోలేకపోయామని అన్నారు. భవిష్యత్తు తరాలకు వారసత్వ నిర్మాణాలు, ఆచారాలు కనిపించకుండా ఈ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. మాస్టర్ ప్లాన్ పేరుతో హిందూమతాన్ని కనుమరుగు చేసే భారీ కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీపై పూర్తి స్థాయిలో సీబీఐతో విచారణ జరిపించాలంటూ రాష్ట్రపతికి, ప్రధానికి, సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రాలను కూడా ఆయన పంపించారు. అధికారులు తమ స్వార్థం కోసం కైంకర్యాల సమయాన్ని కుదించి, అర్చకులను బెదిరిస్తూ తమ పబ్బం గడుపుకుం టున్నారని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే స్వామి వారి ఆగ్రహాన్ని కూడా చవి చూస్తారని హెచ్చరించారు. ఇప్పటికే పిడుగులు పడుతూ ఉన్నాయని తెలిపారు. ఏది ఏమైనా తిరుమలలో పలు నిషేధిత కార్యక్రమాలు జరుగుతున్నట్లు రమణదీక్షితులు చెబుతున్నారు.

Related Posts