న్యూఢిల్లీ, ఏప్రిలం 19,
త్వరలోనే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ ఎన్నికలను. మళ్లీ ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ సైతం సై అంటోంది. దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నాయి. శరద్ పవర్, మమతా, కేసీఆర్, స్టాలిన్, అఖిలేష్.. ఇలా పలువురు నేతలు, పలు పార్టీలు ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో తమ సత్తా చాటాలని తహతహలాడుతున్నాయి. దీంతో.. రాష్ట్రపతి ఎన్నికలపై అన్ని పార్టీలు సీరియస్‌గా కసరత్తు చేస్తున్నాయి. దేశ ప్రధమ పౌరుడు అంటే ఆషామాషీ విషయం కాదు. అందుకే, ఇలాంటి ఎలక్షన్స్‌లో సంఖ్యాబలం కావాలంటే.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులు ఎవరనేది కీలకమైన అంశం. అభ్యర్థిని బట్టి.. పార్టీలకు అతీతంగా ఓటేస్తుంటారు. అందుకే, కేండిడేట్‌ని బట్టే.. గెలుపు డిసైడ్ అవుతుంది. మంచి అభ్యర్థి బరిలో ఉంటే.. ప్రతిపక్షం కూడా మద్దతు ఇస్తుంటుంది. గతంలో అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ, వెంకయ్య నాయుడు తదితరుల విషయంలో అలానే జరిగింది. అందుకే, ఈసారి కూడా బలమైన అభ్యర్థులను, ప్రతిపక్షాలకు ధీటైన కేండిడేట్స్‌ను బరిలో నిలిపేలా కొన్ని పేర్లు తెరమీదకు తీసుకొస్తోంది బీజేపీ-మోదీ. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆనందిబెన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రధాని మోదీ ఏరికోరి మరీ ఆనందిబెన్‌ను ప్రెసిడెంట్ రేసులో నిలబెడుతున్నారని అంటున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆ రాష్ట్ర మంత్రిగా పని చేసిన ఆనందిబెన్.. బీజేపీ నేతగా, మోదీ ప్రధాన అనుచరురాలిగా ఉన్నారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్‌గా ఉన్నారు. ఇలా హార్డ్‌కోర్ బీజేపీ నేత అయిన ఆనందిబెన్‌ను ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారని సమాచారం. మహిళా అభ్యర్థి కావడం మరింత కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.ఇక, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుత కేరళ గవర్నర్ ఆరీఫ్ మహ్మద్ ఖాన్‌ను బరిలో దించుతారని తెలుస్తోంది. బీజేపీ కూటమి తరఫున ముస్లిం కేండిడేట్‌ను పోటీలో నిలపాలనుకోవడం వ్యూహాత్మకం అంటున్నారు. వన్ కేండిడేట్, మెనీ టార్గెట్స్. బీజేపీపై ఉండే ముస్లిం వ్యతిరేక ముద్రను కాస్త మసకబార్చొచ్చు. ముస్లిం అభ్యర్థికి వ్యతిరేకంగా యూపీఏ కూటమి ముస్లిమేతర అభ్యర్థిని నిలిపే సాహసం చేయకపోవచ్చు. చేస్తే, అదికూడా బీజేపీకే రాజకీయ అనుకూలాంశంగా మారుతుంది. అందులోనూ, ఆరీఫ్ మహ్మద్ ఖాన్.. యూపీకి చెందిన నాయకుడు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అత్యంత కీలకమైన యూపీలో మరింత పట్టు సాధించడానికి ఆరీఫ్ ఖాన్‌తో బీజేపీ మరో పావును కదుపనుందని అంటున్నారు. ఆరీఫ్ ఖాన్ పలు పార్టీలు మారుతూ వచ్చారు. కాంగ్రెస్‌తో రాజకీయ అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత జనతాదళ్‌లో చేరి.. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. పదవులు అనుభవించాక బీఎస్పీలో చేరారు. అనంతరం బీజేపీ కండువా కప్పుకొని.. 2019 నుంచి కేరళ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఇలా, రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ, గుజరాతీ, పటేల్, మహిళ.. లెక్కలేసుకొని మరీ ఆనందీబెన్‌ను సెలెక్ట్ చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇక, ఉపరాష్ట్రపతి కేండిడేట్‌గా ముస్లిం, యూపీ కోటాలో ఆరీష్ మహ్మద్ ఖాన్‌ను ఎంపిక చేయనున్నారని చెబుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థులుగా త్వరలోనే వారి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. అదంతా సరే.. దక్షిణాది కోటాలో వెంకయ్య నాయుడును ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబెడుతారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్త పేర్లు వినిపిస్తుండటంతో.. దక్షిణాది వాసుల్లో మరోసారి అసంతృప్తి రగిలే అవకాశమైతే లేకపోలేదు. ఆ సెగ మరింత రాజుకుంటే.. జాబితాలో పేర్లు తారుమారు అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యకు ఛాన్సెస్ ఇంకా ఉన్నాయని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...