మహబూబ్ నగర్, ఏప్రిల్ 19,
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫీవర్ పట్టుకున్నది. ఎన్నికలు ఎప్పుడొస్తాయని విపక్ష పార్టీలన్నీ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు టికెట్ వస్తుందో రాదో అన్న టెన్షన్‌లో పడిపోయారు. ఎలాగైనా టికెట్ సాధించాలనే లక్ష్యంతో ఇప్పటినుంచే పైరవీలు ప్రారంభించారు. అయితే, కొన్ని పార్టీల్లో పైరవీలు వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధిష్టానాలు సైతం ఎవరినీ తేల్చలేక గందరగోళం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఆశావాహుల భవితవ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉంటుంది. దీంతో ఇప్పటికే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుపై టీఆర్ఎస్ బాస్ సర్వే చేయించారు. సర్వేల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్న నియోజకవర్గాల్లో కచ్చితంగా మార్పు ఉంటుందని అంచనా. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా నడుచుకుంటూ అధిష్టానం దృష్టిలో పడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే.. ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో కేడర్ మొత్తం ఫుల్ జోష్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ఊపుతో ప్రజలను నాడిపట్టి వారిని ఓటుబ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే కాంగ్రెస్ నేతలను సరిచేసుకొని, ఓటరు నాడిపట్టి ఓటు బ్యాంకుగా మార్చుకునే శక్తి ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడికి ఉందా అని సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రూపు రాజకీయాలను సెట్ చేసుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని భావించి, నేతలు సైతం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి సెట్ అవుతారో లేదో చూడాలి.ఇదిలా ఉంటే, కొంతమంది సీనియర్ నాయకులు ఎక్కడనుంచి పోటీ చేయాలనేదానిపై క్లారిటీ ఇవ్వాలని, పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ కొడంగల్ నుంచి పోటీ చేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లా కూడా పూర్తిగా కాంగ్రెస్ చేజిక్కించుకోవడం ఖాయమని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ప్రజా బలం ఉన్న నేతలకే కాకుండా, ఆర్థికంగానూ బలంగా ఉన్న నేతలకే అవకాశం ఇవ్వాలని, బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడు పెంచితే అధికారం చేజిక్కించుకోవడం సులభం అవుతుందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. దీంతో పాటు కుల సమీకరణాలు, అధికార పార్టీ అసమ్మతి నేతలతో సన్నిహిత్యం, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి, అధికార పార్టీని దెబ్బతీసే విధంగా అభ్యర్థుల ప్రకటన ఉండాలని భావిస్తున్నారు. గతంలో మాదిరి హంగామా సృష్టించి, ఎన్నికలకు కొద్దిరోజుల ముందే టికెట్ల ఎంపిక చేపడితే పరిస్థితి మళ్లీ అలాగే ఉంటుందని, ఈసారి ముందుగానే పంపకాలు జరుపుకొని జనాల్లోకి వెళ్లాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.మరోపక్క అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్ జిల్లాలో తమకు పోటీనే లేదని బహిరంగంగానే సవాల్‌లు విసురుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేవంత్ కొడంగల్ నుంచి పోటీ చేస్తే.. ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో అధికార పార్టీకి చెక్ పెట్టొచ్చని పార్టీ పెద్దలు, కార్యకర్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో భాగమైనా గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున మంత్రిగా పనిచేసిన డీకే అరుణ ఇప్పుడు బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షులుగా కొనసాగుతుండటంతో గద్వాల్, అలంపూర్, నారయణ పేట్, మక్తల్‌తో పాటు దేవరకద్ర అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎంపీ జితేందర్ తనదైన శైలిలో రాజకీయం నడిపించి బీజేపీ గెలుపునకు కృషి చేశారని పలువురు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు జితేందర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీకి బలమైన లీడర్. మాంచి ఓటు బ్యాంకు ఉన్న నాయకుడిగా స్థానికంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో త్రిముఖ పోటీ ఉన్న రెండు జిల్లా్ల్లో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీపై తేలనుంది. మరి రేవంత్ రెడ్డి ఎక్కడినుంచి పోటీ చేస్తారనేది తెలియాల్సి ఉంది.