హైదరాబాద్, ఏప్రిల్ 19,
ప్రశాంత్ కిశోర్… ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద సంచలనం. ఇంతకీ ఆయన ఇప్పుడు ఎవరిని గెలిపిస్తాడు? కాంగ్రెస్‌నా? టీఆర్‌ఎస్‌నా? మరి ఆయన కాంగ్రెస్ లో చేరితో టీఆర్‌ఎస్ ను ఎలా గెలిపించగలడు? అలా చేస్తే కాంగ్రెస్ కు ద్రోహం చేసినట్లు కాదా? రాజకీయాల్లో వ్యక్తిగతం, వృత్తి భిన్నమైనవా? ఇటీవల కాంగ్రెస్ అధినాయకత్వంతో భేటీ అయినా ప్రశాంత్ కిశోర్ ఓ సంచలనానికి తెరదీశారు. పైకి లోక్ సభ, గుజరాత్ ఎన్నికల వ్యూహం అని చెప్పినా..పరోక్షంగా ఆ పార్టీలో చేరేందుకు దాదాపుగా ఒప్పుకున్నారు. ఇక్కడే ట్విస్టు మొదలైంది. ఈ భేటీ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. రెండు పడవలపై ప్రయాణం సాధ్యమేనా? మరి మొన్నటికి మొన్న టీఆర్‌ఎస్‌తోనూ ఇదే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇటీవల నటుడు ప్రకాశ్ రాజ్‌తో కలిసి సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మల్లన్నసాగర్ రిజర్వాయర్ వద్ద పీకే పర్యటించారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనూ కలియతిరిగారు. ఆయన టీం తెలంగాణలో రంగంలోకి దిగి సర్వేలు కూడా చేసింది. ఇప్పటికే కొన్ని నివేదికలు కూడా ఇచ్చింది. ఈ నివేదిక ఎఫెక్ట్ వల్లే ఉద్యోగ నోటిఫికేషన్ల వంటి వాటిని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారని కూడా వార్తలు వచ్చాయి. పీకే తెలంగాణలో దర్శనమివ్వడంతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఎంట్రీ పై క్లారిటీ వచ్చిందని కూడా విశ్లేషనలు వెలువడ్డాయి. మరిప్పుడేమో అదే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్‌ను, రాష్ట్రంలో అదే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పని చేస్తారా? లేదంటే కేంద్రం వేరు…రాష్ట్రంవేరు అంటారా? ఒకవేళ వృత్తి ధర్మానికి కట్టుబడి రాష్ట్రం టీఆర్‌ఎస్ గెలుపునకు వ్యూహాలు రచిస్తే.. కాంగ్రెస్‌కు ద్రోహం చేసినట్లు కాదా? పార్టీకి మేలు చేస్తారా? లేక తన క్లయింట్ మేలు కోసం పని చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.యితే.. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరి టీఆర్‌ఎస్‌కు వ్యూహకర్తగా పని చేయడంపై క్లారిటీ ఇస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశాలు లేవు. కాంగ్రెస్ లో చేరుతారా? లేక టీఆర్ఎస్ తో సంబంధాలు తెంచుకుంటారా? ఇప్పటికయితే సస్పెన్స్. కానీ..ఈ పరిణామం మాత్రం ఆ రెండు పార్టీలపై దాడిచేసేందుకు బీజేపీకి మంచి అస్త్రంగా మారనుంది. మూడో ఫ్రంట్ పేరిట ఆయా పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కావడంతోనే బీజేపీ విమర్శలు ప్రారంభించింది. ఇదిగో చూశారా.. కాంగ్రెస్‌తో కలవడంలో భాగంగానే ఈ సమావేశాలంటూ ఎదురుదాడికి దిగింది. ఇప్పుడు పీకే అంశాన్ని తెరమీదికి తెచ్చి కాంగ్రెస్ నాయకుడైన పీకే సలహాలు తీసుకుంటున్న కేసీఆర్.. త్వరలోనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని, ఇందుకు వారిద్దరి మధ్య బంధమే నిదర్శనమని అంటూ తన విమర్శలకు మరింత పదును పెంచే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో ఇదే స్లోగన్‌తో ముందుకు వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు!