YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఫస్గ్ పీజీ తెలంగాణలో తీన్మార్... మైండ్ గేమ్ తో పొలిటికల్ పార్టీలు

ఫస్గ్ పీజీ తెలంగాణలో తీన్మార్... మైండ్ గేమ్ తో పొలిటికల్ పార్టీలు

హైదరాబాద్, ఏప్రిల్ 19,
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడూ కూడా మైండ్ గేమ్ రాజకీయాలపైనే ఆధారపడి ముందుకు సాగుతున్నాయి. అంటే స్వంత బలంపై కన్నా, ప్రత్యర్థి పార్టీల బలహీనతలను సొమ్ము చేసుకోవాలన్న యావతోనే ముందుకు సాగుతున్నాయి.   ఇప్పటి నుంచే ఎన్నికల హీట్ రగిలించి....దానిని అసెంబ్లీ ఎన్నికల వరకూ   చల్లారకుండా కొనసాగించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.  ముందస్తు ఎన్నికల ప్రచారం, జంపు జిలానీలంటూ హడావుడీ,  కేసీఆర్  జైలుకెళ్ళడం ఖాయం అంటూ బీజేపీ అధ్యక్షుడు బండి ప్రకటనలూ  చెబుతున్నాయి 95-105 సీట్లు గెలుస్తున్నామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేయడం...రానున్నది మా ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ గంభీర ప్రకటనలూ ఇవన్నీ మైండ్ గేమ్ రాజకీయాలలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మైండ్ గేమ్ పాలిట్రిక్స్ లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒకదానికి మించి మరొకటి తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాయి. ఇందుకు కారణం ఆ మూడు పార్టీలకూ  కూడా ఎటువంటి రాజకీయ అంశం, విధానపరమైన స్పష్టతా లేకపోవడమేనని చెప్పవచ్చు. అందుకే మూడు పార్టీలూ కూడా ఒకదానిని మించిన మరొకటి పలు రకాల ఆరోపణలను తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతున్నారు. వాస్తవానికి గతంలో రాజకీయ పార్టీలు పోటా పోటీగా అభివృద్దిని, సంక్షేమం, సేవలను ప్రచారం చేసుకునేవి. హామీలు, వాగ్ధానాలు, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరించేవి. ఎవరికివారు విస్తృతంగా పోటాపోటీగా ప్రచారం చేసుకునేవి. ఇక విమర్శలు, ఆరోపణలు, అవినీతి వంటివి పూర్తిగా ఇష్యూ బేస్డ్ గా ఉండేవి.  అయితే ఇప్పడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.  అధికారంలో ఉన్నటీఆర్ఎస్ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే ధ్యేయంగా విపక్ష పార్టీలపై విమర్శలకు తెరతీసి పరిస్థితిని నిత్య పోరాటమన్నట్లుగా మార్చేసింది.
కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భారత రాజ్యాంగాన్ని తిరిగి లిఖించాలనీ కేసీఆర్ ఉద్ఘాటన ఇందులో భాగమేననిపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.   మాది రాజకీయ పార్టీ... పథకాలు పెట్టేది ప్రజల్లో గెలిచేందుకు, కేంద్రమంత్రితో, ప్రధాన మంత్రితో నేనే స్వయంగా మాట్లాడాను. జాతీయ స్థాయిలో పార్టీ పెట్టాలా...? అనేది ఒక ఆలోచన. ప్రాంతీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తాం. బిజెపికి వ్యతిరేకంగా జట్టుకడుతాం. డిల్లీలో ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 95 - 105 సీట్లను గెలుస్తున్నాం. మా సర్వే తేల్చింది. ఓ ముఖ్య సలహాదారుడితో కలిసి పనిచేస్తున్నాం... అంటూ తెలంగాణ అధికార పక్షం స్పష్టం చేసింది.  రెచ్చగొట్టి బీజేపీ, కాంగ్రెస్ లను ముగ్గులోకి దింపి ప్రజలలో వాటి ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా తెరాస అధినేత తీరు ఉంది. ఇక బీజేపీ కూడా తానేమీ తీసిపోలేదన్నట్లుగా వేరే సమస్యలేమీ లేవన్నట్లు సీఎం అవినీతి అంటూ పల్లవి ఎత్తుకుంది. ప్రతి సభలోనూ, సమావేశంలోనూ,  అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జైలు కెళ్ళడం ఖాయం. అంటూ బండి సంజయ్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. సిఎంకు ఓటమి భయం పట్టుకున్నది. తెలంగాణలో రానున్నది మా ప్రభుత్వమే. మేము అధికారంలోకి వస్తే హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చేస్తాం.. అంటూ ప్రకటనలు గుప్పిస్తూ పార్టీ క్యాడర్ లో  ఉత్సాహాన్నీ, ప్రజలలో కేసీఆర్ పట్ల సందేహాన్నీరేకేత్తించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.  దాదాపు గత ఏడాది కాలంగా  బండి కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ చెబుతూ వస్తున్నారు. దుబ్మాకలో గెలిచాం. జిహెచ్ఎంసిలో విజయం సాధించాం. హుజూరాబాద్ లో జయకేతనం ఎగురవేశాం. ఇక తెలంగాణలో అధికారంలోకి రావడమే మిగిలింది. అని బిజెపి చెప్పుకొస్తోంది. కాంగ్రెస్ కూడా అదే దారిలో అతి త్వరలోనే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. మరి కొద్దిరోజులు బూత్ స్థాయి నుంచి కష్టపడితే అధికారం మనదే. ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అంటూ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ మైండ్ గేమ్ ఆడుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్, కేటీఆర్ అవినీతి అనే ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇలా రాష్ట్రంలో రాజకీయపార్టీలన్నీ మైండ్ గేమ్ పాలటిక్స్ కు ఇస్తున్న ప్రాధాన్యం ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఇవ్వడం లేదు. రాజకీయ వాతావరణం  వేడిగా ఉంటేనే కేడర్ ను నిలబెట్టుకోవడానికి వీలవుతుందని విపక్షాలు భావిస్తుంటే...ఆ వేడే విపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేస్తుందనీ, ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ ను  సజీవంగా ఉంచుతుందనీ కేసీఆర్ నమ్ముతున్నారు. స్పష్టమైన రాజకీయ నినాదం, అజెండా లేకుండానే సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయ పార్టీలు రాష్ట్రంలో రాజకీయ హీట్ ను పెంచేస్తున్నాయి.

Related Posts