జగిత్యాల ఏప్రిల్ 19
ప్రజల సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జగిత్యాల పట్టణంలో వివిధ వార్డులకు చెందిన 22 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.8 లక్షలు, 18 మంది ఆడపడుచులకు రూ.18.2 లక్షల విలువ చేసే చెక్కులను మున్సిపల్ చైర్ పర్సన్, ఎమ్మెల్యే సంజయ్ ద్విచక్రవాహనంపై లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుధ్యం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసి బయట పారబోయడం వల్ల వాతావరణం కలుషితమై అంటువ్యాధులు ప్రబలుతాయని ఆన్నారు. రూ.2 కోట్లతో నూకపల్లి లో ఎఫ్ ఎస్ టిపి ప్లాంట్ ఏర్పాటు చేసి ఎరువును తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపి వేసి ప్రతి ఒక్కరూ జనప, బట్ట సంచులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ సంచులు వాడడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడంతో పాటు సంచులను మురికి కాల్వల్లో పడేయడంతో మురుగునీరు నిలిచి ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఉద్యోగిని సన్మానించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలో సీఎం సహాయ నిధి,కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తూ మోతే రోడ్డు లోగల శంకర్ ఘాట్ (మోతె స్మశాన వాటిక) పరిశీలించి, స్మశాన వాటిక గార్డెన్,మొక్కలు సంరక్షిస్తూ, స్మశాన వాటికను పరిశుభ్రంగా ఉంచినందుకు అక్కడ విధులు నిర్వహించే మున్సిపల్ ఉద్యోగి రాపర్తి రమేష్ ని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.