విశాఖపట్టణం, ఏప్రిల్ 20,
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వైసీపీలో రేపిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఒక జిల్లాలో అసమ్మతి జ్వాల ఒకింత తగ్గిందనుకుని జగన్ ఊపిరి పీల్చుకునే లోగానే మరో జిల్లాలో మరింత ప్రజ్వలంగా అసమ్మతి మంటలు ఎగసి పడుతున్నాయి. తాజాగా పాయకరావు పేట ఎమ్మెల్యే తాను సింహాన్నిఅంటూ అసమ్మతి గర్జన చేశారు. నేరుగా పార్టీ అధినేత జగన్ కే వార్నింగ్ ఇచ్చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి ఆశించినపాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు....ఉన్నట్టుండి పునవ్యవస్థీకరణ జరిగిన రెండు వారాల తరువాత అధిష్ఠానంపై అసమ్మతి బాంబు వేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడం అన్యాయమంటూ ఆక్రోశం వ్యక్తం చేసి ఊరుకోకుండా....నేరుగా జగన్ సలహాదారు సజ్జలపైనా...పరోక్షంగా జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. తనకు మంత్రి పదవి దక్కకుండా చేసిన వాళ్లను విడిచపెట్టననీ....మూమూలుగా తాను శాంతంగానే ఉంటా అయితే అది నాణేనికి రెండో వైపే అంటూ పార్టీకి హైకమాండ్ కు అంటే జగన్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. సమయం చూసి తాను కొట్టే దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయమని హెచ్చరించారు.ఇప్పటి వరకూ మంత్రి పదవి దక్కని పలువురు వివిధ మార్గాలలో అసమ్మతి వ్యక్తం చేశారు. అయితే గొల్ల బాబూరావులా ఎవరూ నేరుగా జగన్ పై విమర్శల దాడి చేయలేదు. అసమ్మతిని సమర్ధంగా చల్లార్చామని జగన్, ఆయన అనుయాయులు భుజాలు చరుచుకుంటున్న సమయంలోనే ఉరుములేని పిడుగులా గొల్ల బాబూరావు ఘటు విమర్శలతో, తీవ్ర హెచ్చరికలతో విరుచుకుపడటం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఆయనీ వ్యాఖ్యలు చేసింది జగన్ మైండ్ చైల్డ్ గా చెప్పుకునే వలంటీర్ వ్యవస్థకుసంబంధించిన కార్యక్రమంలో. ఆదర్శ వలంటీర్ సేవలకు పురస్కారా ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గొల్ల బాబూరావు....అదే వేదికపై నుంచి పార్టీ హైకమాండ్ పై, జగన్ పై విమర్శలు గుప్పించి, సవాళ్లు సంధించారు. వ్యాఖ్యలు చేశారు.కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తితో రగిలిపోతున్నా బయటపడటానికి జంకుతున్న పలువురు ఎమ్మెల్యేలకు గొల్ల బాబూరావు మార్గదర్శనం చేశారా అన్నచర్చ వైకాపాలో అంతర్గతంగా సాగుతోంది. గొల్ల బాబూరావు పిల్లి మెడలో గంట కట్టేశారనీ, ఇక ఎలుకల్లా భయపడాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలకు ఉండదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.