నెల్లూరు, ఏప్రిల్ 20,
ఏపీ సీఎం ఏ ముహూర్తంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారో గానీ.. ఆ రోజు నుంచీ నెల్లూరు జిల్లాలో వైసీపీలో రచ్చ మొదలైంది. జిల్లాలోని వైసీపీ నేతలు ఒకే రోజు ఒకే సమయంలో విడివిడిగా సమావేశాలు నిర్వహించే దాకా విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఇటీవలి కేబినెట్ లో కొనసాగింపు లేకుండా మాజీగా మారిన అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ మంత్రి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి- ఆనం రామనారాయణరెడ్డిగా ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయంటున్నారు. ఈ విభేదాలు ఎక్కడి దాకా వెళ్లాయంటే.. నగరంలో వేస్తున్న వైసీపీ నేతల ఫ్లెక్సీలను చింపి పారేసే దాకా సమస్య వెళ్లింది. దీంతో నెల్లూరు నగరంలో గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కొద్ది రోజుల క్రితం మంత్రి పదవి చేపట్టిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి తొలిసారిగా నెల్లూరు జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగతం ప్లెక్సీలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చింపి పారేశారు. మంత్రి కాకాని, మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పోటోలతో ఉన్న ఫ్లెక్సీలు నెల్లూరు నగరం అంతా ఏర్పాటు చేశారు. అయితే.. వాటిని తొలగించడం వెనుక తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రోద్బలం ఉందంటూ ఆనం, కాకాని వర్గీయులు బహిరంగంగానే ఆరోపించారు. అనిల్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.ఇలా ఉండగా.. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బర్త్ సందర్భంగా నెల్లూరు నగరంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి ఎవరో చింపేశారు. మంగళవారం నాడు ప్రభాకర్ రెడ్డి బర్త్డే. అయితే.. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చింపేసినట్లు చెబుతున్నా.. ఈ చర్య వెనుక కూడా అనిల్ కుమార్ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను మంగళవారం మళ్లీ ఏర్పాటు చేశారు.ఒకటే పార్టీలో ఉంటున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలను చింపేస్తుండడం గర్హనీయమని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. నెల్లూరు నాయకుడి ప్రోద్బలంతోనే కొందరు పోకిరీలు ఇలా ఫ్లెక్సీలను చింపేస్తున్నారని భయపడుతున్నారు. కొందరు పోకిరీల కారణంగా నెల్లూరు నగరంలో ముందు ముందు దారుణమైన పరిస్థితితులు చూడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటితో ఈ దుశ్చర్యలను ఆపకపోతే ఇలాంటి దురాగతాలు జిల్లా మొత్తం చుట్టుకునే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.
కుక్కలు చింపిన విస్తరిలా పార్టీ
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య గ్రూప్ వార్ రోజు రోజుకూ మరింతగా ముదిరిపోతోంది. నెల్లూరు జిల్లాలోని వైసీపీ ప్రజాప్రతినిధుల్లో ముందు నుంచే ఉన్న వర్గ విభేదాలు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత మరింతగా బరి తెగించి మరీ బయటకు వస్తున్నాయి. ఒక విధంగా చెప్పలంటే ఈ గ్రూప్ వార్ ప్రధానంగా తాజా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి- తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య జరుగుతోందని అంటున్నారు. వీరిద్దరితో పాటుగా మిగతా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు రెండు గ్రూపులుగా మారిపోయి కయ్యానికి సై అంటే సై అంటున్నారు.నెల్లూరు వైసీపీ నేతల గ్రూర్ వార్ ఎంతవరకు వచ్చిందంటే ఒకరి కోసం వేసిన ఫ్లెక్సీలను మరొకరు రాత్రికి రాత్రే చింపేసి, పీకేసి, ధ్వంసం చేసే వరకూ వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తాజాగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. నెల్లూరు జిల్లా నేతల్ని అదుపులో ఉండాలని వైసీపీ అధినేత వార్నింగ్ లు ఇచ్చినా.. తగ్గేదేలే అనే రీతిలో వారు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. మొన్న తాజా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్సీని తీసిపడేశారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా చింపేయడం నెల్లూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.అయితే.. ఈ ఫ్లెక్సీల ధ్వంసం వెనుక తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హస్తం ఉందని కొందరు ఆరోపిస్తుండడం గమనార్మం. తనకు మంత్రి పదవి కొనసాగించకపోవడమే కాకుండా తనకు వ్యతిరేకంగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వడం అనిల్ ఏ మాత్రం సహించలేకపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే కాకాని నెల్లూరుకు మరునాడు వస్తున్నారనగానే అనిల్ కుమార్ మీడియా సమావేశంలో.. తనకు గతంలో కాకాని ఎంతటి గౌరవం ఇచ్చారో.. ఎంత ప్రాధాన్యం ఇచ్చారో.. అంతక డబల్ ఇస్తానంటూ వెటకారం చేయడాన్ని పలువురు ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అనిల్ వ్యవహార సరళిని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని చెబుతున్నారు.ఇక.. కాకాని మంత్రి అయ్యాక తొలిసారి నెల్లూరు వచ్చిన సందర్భంగా నిర్వహించిన అభినందన సభ వేదికగా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయనరెడ్డి అనిల్ పై పేరు చెప్పకుండా రెచ్చిపోయారు. గడిచిన మూడేళ్లుగా నెల్లూరు జిల్లాలో అభివృద్ధి అనే మాటే లేదన్నారు. జిల్లాకు రావాల్సిన అనేక ప్రయోజనాలు, నిధులు రాలేదని దుయ్యబట్టారు. అనిల్ కుమార్ జిల్లా మంత్రిగా ఉన్నంతకాలం రైతులు, సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మంచి మంత్రి కోసం ఈ మూడేళ్లుగా వేయి కళ్లతో ఎదురు చూసిన వారి ఆశలు కాకాని మంత్రి కావడంతో ఫలించాయని అనడం విశేషం. అనిల్ కుమార్ పై ఆగ్రహాన్ని అగణదొక్కుకుంటూనే ఆనం రామనారాయణరెడ్డి పేరు చెప్పకుండా విమర్శలు గుప్పించడంతో గ్రూపు రాజకీయాలు ఎంతదాకా వెళ్లాయో అర్థం అవుతోందంటున్నారు.నిజానికి కాకాని అభినందన సభకు గానీ, మంత్రి అయ్యాక తొలిసారి నెల్లూరు వస్తున్నందున ఆయనకు స్వాగతం పలికేందుకు కానీ అనిల్ కుమార్, మంత్రి పదవి ఆశించి భంగపాటుకు గురైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాకపోగా.. కాకాని అభినందన సభ జరిగే రోజునే.. అదే సమంయలో కార్యకర్తల అభినందన సభ పేరుతో పోటీ సభనిర్వహించడంతో వారి మధ్య గ్రూపు తగాదాలు ఎంత ముదిరిపోయాయో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రి కాకాని అభినందన సభకు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.ఇక నెల్లూరులో రాజకీయంగా కాక రేపుతున్న ఫ్లెక్సీల రగడపై అనిల్ కుమార్ స్పందించారు. ఫ్లెక్సీల ధ్వంసం వెనుక అనిల్ హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలు, విమర్శలకు బదులివ్వడం గమనార్హం. నెల్లూరులో ఫ్లెక్సీలు వేయకూడదనే నిబంధన ఎప్పటి నుంచో ఉందని, తన ఫ్లెక్సీలను కూడా గతంలో వేయనివ్వలేదని గుర్తుచేశారు. ఆ క్రమంలోనే ఇంతకు ముందు దివంగత ఆనం వివేకానందరెడ్డి జయింతి సందర్భంగా వేసిన ఫ్లెక్సీలు కూడా తొలగించిన వైనాన్ని ప్రస్తావించడం గమనార్హం. ఈ క్రమలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలు కూడా తొలగించడంలో ఆశ్చర్యం ఏముందని ముక్తాయింపు ఇవ్వడం విశేషం.ఈ గొడవలు ఇలా ఉండగా తాజాగా మంత్రి కాకాని సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో అనిల్ కుమార్ పర్యటించడం కూడా వివాదాస్పదం అయింది. ‘నా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు మిగిలిన ఎమ్మెల్యేలు రావచ్చు.. నేను సర్వేపల్లి వెళ్లకూడదా?’ అని అనిల్ ప్రశ్నించారు. అంటే అనిల్ కావాలనే రెచ్చగొట్టేందుకే సర్వేపల్లి నియోజకవర్గంలో టూర్ చేశారనే విమర్శలు వస్తున్నాయి. మరో పక్కన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా జిల్లా వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలపై మాట్లాడారు. జిల్లా వైసీపీ నేతల్లో ఇంత రచ్చ ఒకవైపున జరుగుతున్నా.. వైసీపీలోని ఎవరితోనూ తనకు భేదాభిప్రాయాలు లేవని చెప్పడం విశేషం.