తిరుమల, ఏప్రిల్ 20,
కలియుగ వైకుంఠం తిరుమలకు రోజూ వేలాదిమంది భక్తులు వస్తుంటారు. టీటీడీ పాలకమండలి అంటే ఎంతో ఉన్నతమయింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేరచరితులు అంశం హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై కోర్టులో పిటిషన్లు వేశారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో పాటు తనను పాలకమండలి సమావేశానికి హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు ఎస్. సుధాకర్ అయితే, వెంటనే ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది హైకోర్టు. మరికొన్ని పిటిషన్లలో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి, టీటీడీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఆశ్వినీకుమార్, యలమంజుల బాలాజీ వాదించారు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాపై ఉమ మహేశ్వర నాయుడు పాలకవర్గంలో నేరచరితుల పై బీజేపి నేత భాను ప్రకాష్ రెడ్డి పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. తుది వాదనలు వినేందుకు జూన్ 20వ తేదీన కేసు విచారణ వాయిదా పడింది. పాలకమండలి సభ్యులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని విపక్షాలు, హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.